
మత్తుకు బానిసలు కావొద్దు
కొడంగల్: తెలంగాణను గంజాయి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పని చేస్తున్నట్లు డీజీపీ జితేందర్ తెలిపారు. శుక్రవారం కొడంగల్‌లో సీఐ కార్యాలయానికి, కొడంగల్, దుద్యాల్, బొంరాస్‌పేట పోలీస్ స్టేషన్ల నూతన భవనాల నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువత మత్తుకు బానిసలై జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు. డ్రగ్స్, గంజాయి, గంజాయి చాక్లెట్లు విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మాదక ద్రవ్యాల నివారణకు పకడ్బందీ చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. ఇతర రాష్ట్రాల నుంచి మత్తు పదార్థాలు తెస్తున్న వారిపై నిఘా పెట్టినట్లు పేర్కొన్నారు. వ్యసనాలకు గురికావడం వల్ల కుటుంబాలు చెల్లాచెదురవుతాయని అన్నారు. మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే నష్టాలను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలన్నారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై క్రిమినల్ కేసులు పెట్టి జైలుకు పంపుతామని హెచ్చరించారు. బొంరాస్‌పేటలో పోలీస్‌స్టేషన్ నూతన భవన నిర్మాణానికి రూ.2.96 కోట్లు, దుద్యాల్ పోలీస్‌స్టేషన్‌కు రూ.3 కోట్లు, కొడంగల్ సీఐ కార్యాలయానికి రూ.85 లక్షలు,కొడంగల్ పోలీస్ స్టేషన్‌కు రూ.2.96 కోట్లు కేటాయించారు. అధునాతన సౌకర్యాలతో భవనాలు నిర్మిస్తామని డీజీపీ తెలిపారు. భవనాలను త్వరగా నిర్మించి అందుబాటులోకి తెస్తామన్నారు. ఈ సందర్భంగా పోలీసులు డీజీపీకి గౌరవ వందనం సమర్పించారు. కార్యక్రమంలో పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గురునాథ్‌రెడ్డి, కలెక్టర్ ప్రతీక్ జైన్, డీఐజీ తాీప్సీర్ ఎగ్బాల్, ఎస్పీ నారాయణరెడ్డి, హౌసింగ్ ఐజీ రమేష్, తాండూరు సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్, అసిస్టెంట్ ట్రైనీ కలెక్టర్ హర్ష చౌదరి, కడా ప్రత్యేకాధికారి వెంకట్‌రెడ్డి, పరిగి డీఎస్పీ శ్రీనివాస్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ తిరుపతిరెడ్డి, మాజీ ఎంపీపీ ముద్దప్ప దేశ్‌ముఖ్, ఏఎంసీ చైర్మన్ అంబయ్య గౌడ్, పీఏసీఎస్ చైర్మన్ శివకుమార్ గుప్తా, తహసీల్దార్ విజయ్‌కుమార్, పీసీసీ సభ్యుడు మహ్మద్ యూసూఫ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నందారం ప్రశాంత్, సీఐ శ్రీధర్‌రెడ్డి, ఎస్‌ఐలు తదితరులు పాల్గొన్నారు.
గంజాయి రహిత రాష్ట్రంగా తెలంగాణ
డీజీపీ జితేందర్