
థానేలో ఎస్కేప్.. సిటీలో అరెస్టు!
సాక్షి, సిటీబ్యూరో: మహారాష్ట్రలోని థానే కేంద్రంగా సాగిన అంతర్జాతీయ డ్రగ్ సిండికేట్‌లో కీలక నిందితుడు మహ్మద్ రహీమ్ షేక్ అలియాస్ ఫర్హాన్ శంషాబాద్ విమానాశ్రయంలో పోలీసులకు చిక్కాడు. గత నెల 25 నుంచి పరారీలో ఉండి, బహ్రేన్ పారిపోయే ప్రయత్నాల్లో ఉన్న ఇతగాడిని మాన్‌పడా పోలీసులు గురువారం పట్టుకున్నారు. ఫర్హాన్ నేతృత్వంలో ఏర్పడిన గ్యాంగ్ థానే కేంద్రంగా పని చేసింది. మాదకద్రవ్యమైన మెఫెడ్రోన్‌ను మహారాష్ట్రలోని వివిధ నగరాలు, పట్టణాల్లోని పెడ్లర్స్‌కు సరఫరా చేసింది. కొన్నేళ్లుగా గుట్టుగా సాగుతున్న ఈ దందాపై గత నెల్లో థానేలో ఉన్న మాన్‌పడా పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఈ ముఠా వ్యవహారాలపై కన్నేసి ఉంచిన అధికారులు గత నెల 25న అక్కడి ఖోనీ ప్రాంతంలో దాడి చేశారు. ఓ మహిళ సహా ఐదుగురిని పట్టుకున్నారు. వీరి నుంచి రూ.2.12 కోట్ల విలువైన 1.93 కేజీల మెఫెడ్రోన్ స్వాధీనం చేసుకున్నారు. ఈ గ్యాంగ్ విచారణలోనే ఫర్హాన్ పేరు వెలుగులోకి వచ్చింది. డ్రగ్ అతడి ద్వారానే తమకు అందుతుందని, విక్రయించగా వచ్చిన సొమ్ములో తమ కమీషన్ పోను మిగిలింది అతడికే అప్పగిస్తామని గ్యాంగ్ మెంబర్స్ బయటపెట్టారు. దీంతో ఫర్హాన్ కోసం పోలీసుల వేట ముమ్మరమైంది. తన ముఠా పోలీసులకు చిక్కిన విషయం తెలుసుకున్న ఫర్హాన్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. విదేశీ లింకులు ఉన్న ఇతగాడు దేశం దాటి వెళ్లేపోయే అవకాశం ఉందని అనుమానించిన థానే పోలీసులు దేశంలోని అన్ని అంతర్జాతీయ విమానాశ్రయాల వద్దా కన్నేసి ఉంచారు. ఫర్హాన్ పాస్‌పోర్ట్ నెంబర్ ఆధారంగా అతడిపై లుక్ ఔట్ సర్క్యులర్ (ఎల్‌ఓసీ) కూడా జారీ చేశారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బహ్రేన్ వెళ్లిపోవడానికి ఫర్హాన్ ప్రయత్నించాడు. ఈ విషయంపై ఉప్పందుకున్న థానే పోలీసులు నగరానికి చేరుకుని ఎయిర్‌పోర్టు మార్గాల్లో నిఘా ఉంచారు. ఓ వాహనంలో విమానాశ్రయం వైపు వస్తున్న ఫర్హాన్‌ను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఇతడిని అరెస్టు చేసిన థానే పోలీసులు అక్కడకు తరలించి శుక్రవారం కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం ఆదేశాల మేరకు జ్యుడీషియల్ రిమాండ్ నిమిత్తం జైలుకు తరలించారు.
మహారాష్ట్రలోని అనేక నగరాలకు డ్రగ్ సరఫరా
ప్రధాన సూత్రధారిగా ఉన్న మహ్మద్ రహీమ్
నగరం మీదుగా విదేశాలకు పారిపోయే యత్నం
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద అరెస్టు