గుట్టలుగా చెత్త | - | Sakshi
Sakshi News home page

గుట్టలుగా చెత్త

Jul 4 2025 6:33 AM | Updated on Jul 4 2025 6:33 AM

గుట్ట

గుట్టలుగా చెత్త

మున్సిపాలిటీల్లో పేరుకుపోతున్న చెత్తాచెదారం

పోగైన చెత్తను పొగబెట్టి..

షాద్‌నగర్‌: మున్సిపల్‌ పరిధిలో ఇంటింటికీ తిరిగి సేకరిస్తున్న చెత్తనంతా ఊరు చివరన పడేస్తున్నారు. పోగైన చెత్తను కాల్చేస్తుండటంతో దట్టమైన పొగలు వ్యాపిస్తున్నాయి. దీంతో స్థానికులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మున్సిపల్‌ పరిధిలో 28 వార్డులు ఉన్నాయి. సుమారు 20వేల ఇళ్లు ఉన్నాయి. పట్టణంలో సుమారు లక్షకు పైగా జనాభా నివాసం ఉంటోంది. ప్రతి రోజు మున్సిపల్‌ సిబ్బంది సుమారు 33 మెట్రిక్‌ టన్నుల తడి, పొడి చెత్తను సేకరిస్తున్నారు. ఇందులో సుమారు 400 కిలోల వరకు కూరగాయల వ్యర్థాలు ఉంటున్నాయి. ఆరు ట్రాక్టర్లు, 28 ఆటోలను ఉపయోగిస్తూ ఇంటింటికీ వెళ్లి పారిశుద్ధ్య సిబ్బంది చెత్తను సేకరిస్తున్నారు. పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టేందుకు సుమారు 102 మంది సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు.

సోలీపూర్‌ శివారులో డంపు

మున్సిపాలిటీ రోజుకురోజుకూ విస్తరిస్తోంది. పట్టణంలో సేకరించిన చెత్తను ప్రస్తుతం మున్సిపాలిటీ పరిధిలోని సోలీపూర్‌ గ్రామ శివారులో ఉన్న ప్రభుత్వ భూమిలో పారబోస్తున్నారు. తరచూ చెత్తను కాల్చివేయడం ద్వారా పొగ గ్రామం మొత్తం వ్యాపిస్తోంది. చెత్తలో ఉన్న మాంసం వ్యర్థాల కోసం ఈ ప్రాంతంలో కుక్కలు విపరీతంగా సంచరిస్తున్నాయి. దోమలు, ఈగలు వ్యాప్తి చెందడంతో డంపింగ్‌ యార్డును తరలించాలని గ్రామస్తులు కొంత కాలంగా డిమాండ్‌ చేస్తున్నారు.

జాతీయ రహదారి పక్కనే..

మొయినాబాద్‌: హైదరాబాద్‌–బీజాపూర్‌ జాతీయ రహదారిపై డంపింగ్‌ కంపు పెరిగింది. మున్సిపల్‌ పరిధిలోని చెత్తను హిమాయత్‌నగర్‌ రెవెన్యూలో జాతీయ రహదారి పక్కనే డంప్‌ చేస్తున్నారు. దీంతో రోడ్డుపై వెళ్లే వాహనదాలు, ప్రయాణికులు, స్థానికులు దుర్వాసన, ఈగలు, దోమలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీలో 9 పంచాయతీలు విలీనమయ్యాయి. పంచాయతీలుగా ఉన్నప్పుడు అన్ని గ్రామాలకు డంపింగ్‌ యార్డులు వేర్వేరుగా ఉన్నాయి. ఆరు నెలల క్రితం మున్సిపాలిటీ ఏర్పాటైంది. పంచాయతీగా ఉన్నప్పటి నుంచి మొయినాబాద్‌కు డంపింగ్‌యార్డు లేదు. అప్పట్లో సురంగల్‌ రోడ్డు పక్కన ఖాళీ స్థలంలో డంప్‌ చేసేవారు. అక్కడి నుంచి బైపాస్‌ రోడ్డు ఏర్పాటు చేస్తుండడంతో మున్సిపల్‌ కేంద్రంలోని చెత్తను ప్రస్తుతం హిమాయత్‌నగర్‌ రెవెన్యూలో జాతీయ రహదారి పక్కన పడేస్తున్నారు. మొయినాబాద్‌లోనే నిత్యం సుమారు 10–12 ట్రాక్టర్ల చెత్త వెలువడుతోంది. మొయినాబాద్‌, హిమాయత్‌నగర్‌ నుంచి వెలువడే చెత్తనంతా ఒకేచోట వేస్తుండం.. ప్రస్తుతం వర్షాలు కురుస్తుండడంతో దుర్వాసన వెదజల్లుతోంది. మరోవైపు మున్సిపాలిటీలోని ఏడు గ్రామాల్లో ఎక్కడి డంపింగ్‌ యార్డులు అక్కడే ఉన్నాయి.

స్థలంకోసం అన్వేషణ

చేవెళ్ల: కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీ కావడంతో సరైన డంపింగ్‌ యార్డుకోసం స్థల అన్వేషణ జరుగుతోంది. పంచాయతీగా ఉన్న సమయంలో ఆయా గ్రామాల్లో ఉన్న ప్రభుత్వ భూమిలో డంపింగ్‌ యార్డును ఏర్పాటు చేసి అక్కడే డంపింగ్‌ చేశారు. మున్సిపాలిటీగా ఏర్పాటైన తరువాత 12 గ్రామాలకు సరిపడా డంపింగ్‌యార్డు ఒకేచోట ఏర్పాటుకు స్థలం కావాల్సి ఉంది. అనువైన స్థలం అందుబాటులోకి వచ్చాక చెత్త సేకరణతో కంపోస్ట్‌ ఎరువు తయారు చేయడంతో పాటు తడిపొడి చెత్తను వేర్వేరుగా సేకరించి వేయనున్నారు. ప్రస్తుతం ఇంటింటికీ వెళ్లి సేకరిస్తున్న చెత్తను అందుబాటులో ఉన్న డంపింగ్‌ యార్డుల్లో వేస్తున్నారు. డంపింగ్‌ యార్డులు రోడ్ల పక్కన నివాసాలకు దగ్గరలో ఉండడంతో స్థానికులు ఇబ్బంది పడుతున్నారు.

మున్సిపాలిటీలను చెత్త సమస్య వెంటాడుతోంది. డంపింగ్‌ యార్డులు లేకపోవడంతో సేకరించిన చెత్తనంతా పురపాలికల శివార్లలో డంప్‌ చేస్తున్నారు. దీంతో కుప్పలుగా పేరుకుపోతోంది. ఈగలు, దోమలు వ్యాప్తి చెందడంతో పాటు చెత్తను తరచూ తగులబెడుతుండడంతో దట్టమైన పొగలు వెలువడుతున్నాయి. చెత్తతో రోగాలపాలవుతున్నామని, పొగతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నామని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాలని కోరుతున్నారు.

సరైన డంపిగ్‌ యార్డులు కరువు

శివార్లలో పడవేత.. కాల్చివేత

అసౌకర్యానికి గురవుతున్న స్థానికులు

గుట్టలుగా చెత్త1
1/4

గుట్టలుగా చెత్త

గుట్టలుగా చెత్త2
2/4

గుట్టలుగా చెత్త

గుట్టలుగా చెత్త3
3/4

గుట్టలుగా చెత్త

గుట్టలుగా చెత్త4
4/4

గుట్టలుగా చెత్త

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement