
ఫార్మా వద్దు.. ఫ్యూచర్ వద్దు
యాచారం: ఫార్మాసిటీ పేరుతో గత బీఆర్‌ఎస్ సర్కార్ రైతుల భూములను బలవంతంగా లాక్కుంటే.. ఫ్యూచర్‌సిటీ పేరుతో ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ కూడా అదే పంథా అనుసరిస్తోందని ఆయా గ్రామాల రైతులు విమర్శించారు. శ్రీఫార్మాసిటీ వద్దు.. ఫ్యూచర్‌సిటీ అసలే వద్దుశ్రీ అని నినదించారు. టీజీఐఐసీ పేరు మీద మార్చిన పట్టా భూముల రికార్డులను రైతుల పేరిట మార్చాలని.. భూసేకరణ నిలిపేయాలని.. అర్హులైన అసైన్డ్, కబ్జాలో ఉన్న రైతులకు న్యాయమైన పరిహారం అందించాలని డిమాండ్ చేస్తూ గురువారం ఫార్మాసిటీ వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో కుర్మిద్ద నుంచి తాడిపర్తి, నానక్‌నగర్, నక్కర్తమేడిపల్లి వరకు పాదయాత్ర నిర్వహించారు. నక్కర్తమేడిపల్లిలోని ఫార్మాసిటీ వ్యతిరేక స్థూపం వద్ద నల్లా జెండాలు కట్టి సీఎం రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, రైతు కమిషన్ చైర్మన్ ముదిరెడ్డి కోదండరెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నాలుగేళ్లుగా టీజీఐఐసీ పేరు మీదున్న భూ రికార్డులు రైతుల పేర్లపై నమోదు కాకపోవడంతో రైతుభరోసా, బ్యాంకు రుణాలు, అత్యవసర సమయాల్లో క్రయవిక్రయాలు కాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్టు తెలిపారు. రైతుల సమస్యలు పరిష్కరించాలని హైకోర్టు స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేసినా అధికారుల్లో చలనం లేదన్నారు. ఫ్యూచర్‌సిటీ పేరుతో మళ్లీ భూములు కావాలని వేధింపులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యలు పరిష్కరించకుంటే పోరాటాలు కొనసాగిస్తామని హెచ్చరించారు. ముందు జాగ్రత్తగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో తెలంగాణ పీపుల్స్ జేఏసీ జాయింట్ కన్వీనర్ కన్నెగంటి రవి, మానవ హక్కుల వేదిక నుంచి విశ్రాంత శాస్త్రవేత్త బాబురావు, హైకోర్టు న్యాయవాది శ్రీకాంత్, కుర్మిద్ద, తాడిపర్తి, నానక్‌నగర్ మాజీ సర్పంచులు, ఫార్మాసిటీ వ్యతిరేక పోరాట కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
బాధిత రైతుల ఆందోళన
పాలకుల తీరుకు నిరసనగా పాదయాత్ర
సర్కార్‌కు వ్యతిరేకంగా నినాదాలు