
సర్ధార్‌నగర్‌ను సందర్శించిన తమిళనాడు బృందం
షాబాద్: మండలంలోని సర్ధార్‌నగర్ గ్రామాన్ని తమిళనాడు బృందం గురువారం సందర్శించింది. గ్రామ పరిపాలన, పౌరసేవలు, వివిధ పథకాల అమలు బాగుందని కితాబిచ్చింది. ఎంసీఆర్‌హెచ్‌ఆర్డీ ద్వారా సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (సుపరిపాలన కేంద్ర) శిక్షణ బృందం అనిల్‌కుమార్, వెంకటరమణ తమిళనాడు సర్పంచులు, బ్లాక్ అధ్యక్షులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, అధికారుల బృందంతో కలిసి గ్రామంలో సౌకర్యాలు, వనరులు, అభివృద్ధిని పరిశీలించారు. అనంతరం పంచాయతీ ఆవరణలో మొక్కలు నాటారు. పంచాయతీ భవనం, గ్రంథాలయం, క్రీడా ప్రాంగణం, సెగ్రిగేషన్ షెడ్, పల్లె ప్రకృతి వనాలను సందర్శించి బాగున్నాయని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీఓ శ్రీనివాస్, ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు, అంగన్‌వాడీ టీచర్ చంద్రకళ, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.
రేపటినుంచి వ్యవసాయ కార్మిక సంఘం మహాసభలు
షాద్‌నగర్‌రూరల్: పట్టణంలోని విశ్రాంత ఉద్యోగుల సంఘం భవనంలో ఈ నెల 5,6 తేదీల్లో నిర్వహించనున్న వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా 9వ మహాసభలను విజయవంతం చేయాలని సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బుద్దులజంగయ్య గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వ్యవసాయ కార్మికుల సమస్యలు, ఉపాధి హామీ కూలీల సమస్యలపై ఈ మహాసభల్లో చర్చించనున్నట్టు తెలిపారు. భవిష్యత్ కార్యాచరణ రూపొందించి పోరాటాలకు రూపకల్పన చేయడం జరుగుతుందని వివరించారు. ఈ మహాసభలకు వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కలకొండ కాంతయ్య, సీపీఐ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్యతో పాటు రాష్ట్ర నాయకులు హాజరు కానున్నారని చెప్పారు.
మార్కెట్ సిబ్బంది నిరసన
ఇబ్రహీంపట్నం: మహబూబ్‌నగర్ మార్కెట్ కమిటీ కార్యదర్శి భాస్కర్‌పై ఆ కమిటీ వైస్ చైర్మన్ విజయ్‌కుమార్ దాడి చేయడాన్ని ఖండిస్తూ గురువారం ఇబ్రహీంపట్నం వ్యవసాయ మార్కెట్ సిబ్బంది భోజన విరామ సమయంలో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా టీఎన్‌జీఓ వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యదర్శి సంతోష్ మాట్లాడుతూ.. దాడికి పాల్పడిన వైస్ చైర్మన్‌ను పదవి నుంచి తొలగించి చట్టపరమైన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
హెచ్‌ఎండీఏ అనుమతులు అదుర్స్
సాక్షి, సిటీబ్యూరో: హెచ్‌ఎండీఏ పరిధిలో ‘రియల్’ పరుగు ఊపందుకుంది. ఈ ఏడాది ఇప్పటి వరకు భవనాలు, అపార్ట్‌మెంట్‌లు, హైరైజ్ బిల్డింగ్‌లు, లే అవుట్ తదితర నిర్మాణ రంగానికి సంబంధించి 922 అనుమతులను (ప్రొసీడింగ్స్)ను ఇచ్చినట్లు హెచ్‌ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ తెలిపారు. వీటిపై ఫీజుల రూపంలో ప్రభుత్వానికి రూ.519 కోట్లకు పైగా ఆదాయం లభించింది. గతేడాది జనవరి నుంచి జూన్ వరకు అందజేసిన అనుమతుల కంటే ఈ ఏడాది జూన్‌వరకు నిర్మాణరంగ అనుమతులు పెరిగాయి. గత సంవత్సరం జూన్ నాటికి 388 అనుమతులు మాత్రమే అందజేయడం గమనార్హం. మొత్తంగా 2024లో హెచ్‌ఎండీఏ 878 అనుమతులను అందజేసింది. వీటిపై రూ.395.13 కోట్ల ఆదాయం లభించింది. మరోవైపు 2023లో 1,361 అనుమతులను ఇచ్చారు. రూ.563.32 కోట్ల ఆదాయం లభించింది. నిర్మాణరంగంలో ఎలాంటి స్తబ్దత లేదని, గత రెండేళ్లుగా పరుగులు పెడుతూనే ఉందని కమిషనర్ పేర్కొన్నారు. ఈ సంవత్సరం ఇప్పటి వరకు 922 ప్రొసీడింగ్స్ ఇవ్వగా డిసెంబర్ నాటికి రెట్టింప య్యే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. మరోవైపు అనుమతుల్లో ఎలాంటి జాప్యానికి తావు లేకుండా సకాలంలో అందజేస్తున్నట్లు చెప్పారు. బిల్డ్‌నౌ అందుబాటులోకి వచ్చిన తర్వాత దరఖాస్తు ప్రక్రియ మరింత సులభతరమైందన్నారు.

సర్ధార్‌నగర్‌ను సందర్శించిన తమిళనాడు బృందం