‘ముసురు’తున్న వ్యాధుల ముప్పు! | - | Sakshi
Sakshi News home page

‘ముసురు’తున్న వ్యాధుల ముప్పు!

Jul 3 2025 7:27 AM | Updated on Jul 3 2025 7:27 AM

‘ముసు

‘ముసురు’తున్న వ్యాధుల ముప్పు!

నిధుల దుర్వినియోగం.. షాద్‌నగర్‌ పోస్టాఫీస్‌లో నిధుల దుర్వినియోగంపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు.

8లోu

సాక్షి, రంగారెడ్డి జిల్లా: ‘వర్షాల వెన్నంటే వ్యాధులు ముసురుకుంటున్నాయి. పట్టణాలు, పల్లెలు తేడా లేకుండా పలువురు దగ్గు, జ్వరం, ఒంటినొప్పులు, వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నారు. ప్రస్తుతం వనస్థలిపురం, కొండాపూర్‌ సహా జిల్లాలోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల సాధారణ ఓపీల్లో కన్పించే రోగుల్లో 40 శాతం మంది(పెద్దలు, చిన్నారులు)జ్వరపీడితులే. ఇవి సాధారణంగా కన్పించే లక్షణాలే అయినా.. అప్రమత్తత అవసరం’అని మహేశ్వరం మెడికల్‌ కళాశాల అనుబంధ(వనస్థలిపురం ఏరియా ఆస్పత్రి) ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ బి.నాగేందర్‌ స్పష్టం చేశారు. ఏమాత్రం అలసత్వం వహించినా.. అనారోగ్యంతో ఆస్పత్రుల్లో చేరక తప్పదని హెచ్చరించారు. బుధవారం ఆయన సీజనల్‌ వ్యాధులపై ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ‘బాధితులకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు ప్రభుత్వ ఆస్పత్రులు ఉన్నాయి. రక్త, మూత్ర, ఇతర వైద్య పరీక్షలను ఉచితంగా చేయడంతో పాటు అవసరమైన మందులను అందజేస్తున్నాయి. ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయించి, ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో క్వాలిఫైడ్‌ వైద్యుడితో చికిత్సలు చేయించుకోవడం ఉత్తమం’అని చెప్పారు.

వైరస్‌ వ్యాప్తికి అనుకూలం

వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు చోటు చేసుకున్నాయి. మూడు రోజులుగా కురుస్తున్న చిరుజల్లుల కారణంగా ఉష్ణోగ్రతలు పడిపోయి, గాల్లో తేమశాతం పెరగడంతో వైరస్‌ వ్యాప్తికి అనుకూలంగా ఉంటుంది. శరీరం ఈ మార్పులకు అలవాటు పడేందుకు కొంతసమయం పడుతుంది. రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. ఫ్లూ కారక వైరస్‌లు సులభంగా వ్యాపిస్తుంటాయి. దగ్గు, జలుబు, జ్వరం ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతుంది. ఇంట్లో ఒకరి తర్వాత మరొకరు అస్వస్థతకు గురవుతుంటారు. ఈ లక్షణాలతో కన్పించే పిల్లలను బడికి పంపకపోవడం ఉత్తమం. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం, వ్యక్తిగత శుభ్రత, పౌష్టికాహారం తీసుకోవడం వంటి స్వీయ జాగ్రత్తలతో సీజనల్‌ వ్యాధులు దరి చేరకుండా చూసుకోవచ్చు.

పొంచి ఉన్న డెంగీ ముప్పు

చిరుజల్లులకు ఇంట్లోని పూల కుండీలు, ఇంటిపై ఖాళీ డబ్బాలు, మూతల్లేని ట్యాంకుల్లో వర్షపు నీరు నిల్వ ఉంటుంది. దీంతో డెంగీ కారక దోమలు పగటిపూట పిల్లలు, వృద్ధులపై దాడి చేస్తుంటాయి. విపరీతమైన జ్వరం, ఒంటి నొప్పులతో బాధపడుతూ ఆస్పత్రుల్లో చేరుతుంటారు. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న బాధితుల్లో ప్లేట్‌లెట్స్‌ సంఖ్య క్రమంగా పడిపోతోంది. ప్లేట్‌లెట్స్‌ సంఖ్య భారీగా పడిపోవడంచికిత్సలో జాప్యం కారణంగా ఒక్కోసారి ప్రాణాల మీదికొస్తుంది. మస్కిటో కాయిల్స్‌, మస్కిటో మ్యాట్‌, కిటికీలకు జాలీలను ఏర్పాటు చేసుకోవడం, కాళ్లు, చేతులు పూర్తిగా కప్పి ఉంచేలా దుస్తులు ధరించడం, దోమ తెరలను వాడటం వంటి స్వీయ జాగ్రత్తలతో డెంగీని దరిచేరనీయకుండా చూసుకోవచ్చు.

బయటి ఆహారం వద్దు

ప్రస్తుతం చెరువుల్లోకి వచ్చే నీటివరదతో పాటే బ్యాక్టీరియా చేరుతోంది. సరిగా శుద్ధి చేయని ఈ నీటిని తీసుకుంటే అనారోగ్య సమస్యలు తలెత్తుతుంటాయి. కలుషిత నీటిని తాగడంతో వాంతులు, విరేచనాల బారిన పడుతుంటారు. వీధుల్లోని చిరుతిళ్లు, పానీపూరి ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది. సాధ్యమైనంత వరకు బయటి ఆహారాన్ని తీసుకొవద్దు. తాజాగా వండిన ఆహారాన్ని తీసుకోవడమే ఉత్తమం. కాచి చల్లార్చిన నీటిని సేవించడం, సి విటమిన్‌ లభించే పండ్లను తీసుకోవడం ద్వారా సీజనల్‌ వ్యాధుల నుంచి రక్షించుకోవచ్చు.

ఖర్చు లేకుండా ఖరీదైన వైద్యసేవలు

వనస్థలిపురం ఏరియా ఆస్పత్రిని మహేశ్వరం మెడికల్‌ కళాశాల అనుబంధ ఆస్పత్రిగా కేటాయించారు. ఇక్కడ 11 విభాగాల్లో 17 మంది ప్రొఫెసర్లు, 38 మంది అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, రోగుల నిష్పత్తి మేరకు స్టాఫ్‌ నర్సులు, టెక్నీషియన్లను నియమించారు. గతంలో ఔట్‌ పేషెంట్‌ విభాగంలో రోజుకు సగటున 250–300 మంది వస్తే.. ప్రస్తుతం 800 మందికిపైగా వస్తున్నారు. 220 పడకలు, మూడు ఆపరేషన్‌ థియేటర్లు ఉన్నాయి. ఐసీయూ విభాగాలున్నాయి. ఎంత మంది వచ్చినా మెరుగైన సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నాం. పైసా ఖర్చు లేకుండా ఖరీదైన వైద్యసేవలు పొందొచ్చు. వైద్య సేవల్లో ఏ చిన్న సమస్య ఎదురైనా స్వయంగా వచ్చి సూపరింటెండెంట్‌ను కలువచ్చు.

చాపకింది నీరులా విస్తరిస్తున్న డెంగీ, డయేరియా, వైరల్‌ జ్వరాలు

ప్రభుత్వ ఆస్పత్రులకు రోగుల క్యూ

స్వీయ జాగ్రత్తలే శ్రీరామ రక్ష : మహేశ్వరం మెడికల్‌ కళాశాల ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ నాగేందర్‌

నాలుగు నెలల ఓపీ వివరాలు

మాసం ఓపీ

మార్చి 16,130

ఏప్రిల్‌ 12,645

మే 22,716

జూన్‌ 22,668

‘ముసురు’తున్న వ్యాధుల ముప్పు!1
1/1

‘ముసురు’తున్న వ్యాధుల ముప్పు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement