
● ఏడేళ్లయినా రోడ్లే లేవు.. లైట్లే వెలగవు
శంకర్‌పల్లి: మున్సిపాలిటీ ఏర్పడి ఏడేళ్లు పూర్తి కావస్తున్నా పట్టణంలోని కొన్ని కాలనీలకు సరైన రోడ్లు లేవు. వర్షాకాలంలో స్థానికులు పడే బాధ వర్ణణాతీతం. ఇప్పటికే పలువురు కమిషనర్లకు విన్నవించినా ప్రయోజనం లేదని వాపోతున్నారు. ప్రస్తుతం రూ. 4కోట్ల టీయూఎఫ్‌ఐడీసీ నిధులతో సింగాపురం, రిత్విక్ వెంచర్, చిన్న శంకర్‌పల్లి, సాయినగర్ కాలనీ, ఫత్తేపూర్‌లో రోడ్ల నిర్మాణ పనులు చేపడుతున్నారు. బుల్కాపూర్, కొత్తగా ఏర్పాటైన బ్లూవుడ్స్ కాలనీ, రెడ్డి కాలనీ, మైనార్టీ కాలనీ, ఆదర్శ్ నగర్ కాలనీ, ఎస్‌ఎం గార్డెన్స్ ప్రాంతాల్లో మరిన్ని రోడ్లు వేయాల్సి ఉంది. మున్సిపల్ పరిధిలో చాలావరకు వీధి లైట్లు వెలగడం లేదు. శంకర్‌పల్లి చౌరస్తా నుంచి బుల్కాపూర్ వరకు ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్, ఫత్తేపూర్ రైల్వే బ్రిడ్జిపై వీధి దీపాలు వెలగకపోవడంతో రాత్రి వేళ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై మున్సిపల్ కమిషనర్ యోగేశ్‌ని వివరణ కోరగా సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.