
ఏసీబీకి చిక్కిన అవినీతి చేపలు
● తలకొండపల్లి తహసీల్ కార్యాలయంపై అవినీతి నిరోధక శాఖ దాడులు
● లంచం తీసుకుంటూ పట్టుబడిన తహసీల్దార్, అటెండర్
ఆమనగల్లు: ఏసీబీ అధికారులు నిత్యం దాడులు చేసి కేసులు నమోదు చేస్తున్నా అవినీతి అధికారులు మాత్రం లంచం తీసుకోవడం మానడం లేదు. మంగళవారం ఓ రైతు వద్ద లంచం తీసుకుంటూ తహసీల్దార్, అటెండర్ ఏసీబీకి పట్టుపడ్డారు. వివరాలు.. తలకొండపల్లి మండలం అంతారం గ్రామానికి చెందిన ఓ రైతు తన తల్లిపేరిట ఉన్న 22 గుంటల భూమిని తనతోపాటు తన సోదరుల పేరిట మార్చాలని తహసీల్దార్‌ను ఆశ్రయించాడు. ఇందుకు అక్కడి అధికారులు రూ.50 వేలు డిమాండ్ చేశారు. దీంతో సదరు రైతు ఏసీబీ అధికారులకు సమాచారం ఇచ్చాడు. ఏసీబీ అధికారుల సూచనల మేరకు రైతు తహసీల్దార్ కార్యాలయంలో మంగళవారం సాయంత్రం రూ.10 వేలు ఇస్తుండగా తహసీల్దార్ నాగార్జున, అటెండర్ యాదగిరిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఇద్దరిపై కేసు నమోదు చేసి జుడీషియల్ రిమాండ్‌కు తరలించినట్లు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.
టపాసులు కాల్చి రైతుల సంబురాలు
తలకొండపల్లి తహసీల్దార్ కార్యాలయంపై ఇటీవల అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కార్యాలయంలో ఏ చిన్నపని కావాలన్నా ముడుపులు ఇవ్వాల్సిందే అని పలువురు ఆరోపించారు. తహసీల్దార్ నాగార్జున లంచటం తీసుకుంటూ అధికారులకు చిక్కడంతో తహసీల్దార్ కార్యాలయం వద్ద రైతులు టపాసులు కాల్చి సంబురాలు జరుపుకొన్నారు.

ఏసీబీకి చిక్కిన అవినీతి చేపలు