
సాగునీరందించడంలో విఫలం
● పాలమూరు అధ్యయన వేదిక జిల్లా కన్వీనర్ రవీంద్రనాథ్
షాద్‌నగర్‌రూరల్: ఉమ్మడి పాలమూరు జిల్లాకు సాగునీరు అందించడంలో, కాలుష్యాన్ని నియంత్రించడంలో ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యా యని పాలమూరు అధ్యయన వేదిక జిల్లా కన్వీనర్ రవీంద్రనాథ్ ఆరోపించారు. పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో సోమవారం పాలమూరు అధ్యయన వేదిక ఆధ్వర్యంలో ఉమ్మడి పాలమూరుకు సాగునీరు– కాలుష్య పరిశ్రమలపై 5వ తేదీన హైదరాబాద్‌లో నిర్వహించనున్న సదస్సు కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రవీంద్రనాథ్ మాట్లాడుతూ.. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల సాధన పోరాటం తొలుత కల్వకుర్తి లిఫ్టు, షాద్‌నగర్ లిఫ్టులాగా మొదలైందని, 15 ఏళ్ల ఆందోళన తరువాత 2013లో జీవోలను సాధించుకోగలిగామని అన్నారు. తొలి తెలంగాణ ప్రభుత్వం ఈ పథకాన్ని జూరాల నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు మార్చి తప్పు చేసిందని, 2015లో పనులను ప్రారంభించి మూడేళ్లలో పూర్తి చేస్తామని నమ్మించి ప్రతిపాదనలో లేని డిండిని తగిలించి మోసం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాలకోసం సాధించుకున్న పీఆర్‌ఎల్‌ఐ నీటిని ఏదుల నుంచి అక్రమంగా నల్లగొండకు తరలించుపోతున్నారని ఆరోపించారు. లక్ష్మిదేవిపల్లి రిజర్వాయర్ అన్ని రాజకీయ పార్టీలకు ఎన్నికల ఆటగా మారిందని విమర్శించారు. హైదరాబాద్ నిర్వహించే సదస్సుకు విద్యావంతులు, విద్యార్థులు, రైతులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వేదిక జిల్లా కో కన్వీనర్ నర్సింలు, డీటీఎఫ్ జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్, పౌరహక్కుల సంఘం నాయకుడు తిరుమలయ్య తదితరులు పాల్గొన్నారు.