
పెట్రోల్ ట్యాంకర్‌కు మంటలు
కుషాయిగూడ: ప్రమాదవశాత్తు పెట్రోల్ ట్యాంకర్ కు మంటలంటుకున్న సంఘటన ఆదివారం చర్లపల్లి పారిశ్రామికవాడలోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వద్ద చోటు చేసుకుంది. డ్రైవర్ అప్రమత్తతో పాటు ఫైర్ సిబ్బంది సకాలంలో స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది. వివరాల్లోకి వెళితే.. కొన్నాళ్లుగా నిలిచిపోయిన ట్యాంకర్ లారీని రిపేరు చేస్తూ ట్రయల్‌రన్ చేస్తున్న క్రమంలో చర్లపల్లి పారిశ్రామికవాడలోని ఐఓసీఎల్ వద్ద ట్యాంకర్ నుంచి ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. అప్రమత్తమైన మెకానిక్, ఇతర డ్రైవర్లు వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారమివ్వడంతో ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ క్రమంలో పక్కనే ఉన్న మరో ట్యాంకర్‌కు మంటలు వ్యాపించడంతో అందరూ భయంతో పరుగులు తీశారు. అప్రమత్తమైన ఫైర్ సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించి మంటలను అదుపు చేశారు. పక్కనే పార్కు చేసి ఉన్న సిలిండర్ల ట్రక్కుకు మంటల వ్యాపిస్తే పెనుప్రమాదం జరిగి ఉండేదన్నారు. ఈ విషయమై చర్లపల్లి ఇన్‌స్పెక్టర్ రవికుమార్‌ను వివరణ కోరగా చాలా రోజులుగా నిలిచిపోయిన ట్యాంకర్ ట్రయల్‌రన్ వేస్తున్న క్రమంలోనే ప్రమాదం జరిగిందన్నారు. విచారణ చేపడతామని పేర్కొన్నారు.
ట్రయల్ రన్ చేస్తుండగా ప్రమాదం
మంటలను అదుపు చేసిన ఫైర్ సిబ్బంది