
మహిళలు ఆర్థికంగా ఎదగాలి
డీఆర్‌డీఓ శ్రీలత
నందిగామ: మహిళలు ఆర్థికంగా ఎదగాలని, పలువురికి ఉపాధి కల్పించాలని డీఆర్‌డీఓ శ్రీలత అన్నారు. మండల పరిధిలోని సంఘీగూడలో డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో వడ్డే కవితకు మంజూరైన రూ. 5లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన ఒత్తుల తయారీ కేంద్రాన్ని శుక్రవారం ఆమె ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీలత మాట్లాడుతూ.. పురుషులతో సమానంగా మహిళలు సైతం అన్ని రంగాల్లో రాణించాలని ఆకాంక్షించారు. కేవలం భర్తల ఆదాయం పై మాత్రమే ఆధారపడకుండా స్వయం శక్తితో ఎదగాలని సూచించారు. కార్యక్రమంలో ఏపీఎం యాదగిరి, సీసీ అనురాధ, మండల మహిళా సమాఖ్య సభ్యులు శ్రీనిధి, రజిత, సువర్ణ, స్వప్న తదితరులు పాల్గొన్నారు.