
లేగదూడ కళేబరాన్ని పరిశీలిస్తున్న అటవీశాఖ అధికారులు
● మృత్యువాత పడుతున్న లేగదూడలు
● ఆందోళన చెందుతున్న రైతులు
షాద్‌నగర్ రూరల్: హైనా దాడిలో లేగదూడలు మృత్యువాత పడుతున్నాయి. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఫరూఖ్‌నగర్ మండల పరిధిలోని దూసకల్ శివారులో ఆదివారం తెల్లవారు జామున హైనా దాడిలో మరో లేగదూడ హతమైంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. గ్రామస్తులు పొలాల వద్ద పశువుల పాకల ఏర్పాటు చేసుకున్నారు. కొన్ని రోజులుగా గుర్తు తెలియని జంతువు దాడిలో లేగదూడలు చనిపోతున్నాయి. దీంతో గ్రామానికి చెందిన రైతులు చిన్న కొమురయ్య, పెద్ద నర్సింహ, ఈర్లపల్లి అంజయ్య, పోచయ్య, దాసరి కృష్ణయ్య పశువుల పాకవద్ద నిద్రకు ఉపక్రమించారు. తెల్లవారుజామున ఎంపీటీసీ మాజీ సభ్యురాలు స్వప్న పొలంవద్ద చిరుత లేగదూడపై దాడి చేస్తున్న సమయంలో కుక్కలు అరవడంతో రైతులు అప్రమత్తమయ్యారు. వారు గమనించగా చిరుత కుక్కలపైకి గాండ్రిస్తూ వెళ్లిపోయింది. చిరుతను చూసిన రైతులు, గ్రామస్తులు ఆందోళనకు గురవుతున్నారు. అటవీశాఖ అధికారులు వెంటనే స్పందించి చిరుతను పట్టుకోవాలని కోరుతున్నారు. పట్టణ సమీపంలోని వ్యవసాయ పొలాలవద్ద చిరుత సంచరిస్తుందనే వార్త వాట్సాప్‌లలో రావడంతో పట్టణ వాసులు భయాందోళనకు గురయ్యారు.
చిరుత కాదు హైనా
లేగదూడలపై చిరుత దాడి చేసిన విషయాన్ని తెలుసుకున్న అటవీశాఖ అధికారులు, పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. లేగదూడలను, గుర్తు తెలియని జంతువు తిరిగిన ఆనవాళ్లను ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ రవీందర్‌గౌడ్, బీట్ ఆఫీసర్ అజీజ్ పరిశీలించారు. జంతువు పాద ముద్రలను పరిశీలించిన అధికారులు హైనాగా నిర్ధారించారు. చిరుత గొంతుపై దాడి చేస్తుందని.. హైనా మాత్రమే వెనుక కాళ్ల భాగంలో దాడి చేస్తుందని చెప్పారు. లేగదూడలు హైనాల బారిన పడకుండా రైతులు పాకవద్ద విద్యుత్ దీపాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. చిరుత సంచారమనేది అవాస్తవమని.. రైతులు ఆందోళనకు గురికావొద్దని అటవీశాఖ అధికారులు, పోలీసులు సూచించారు.