
సాక్షి, రంగారెడ్డిజిల్లా: పలు కార్పొరేట్ విద్యా సంస్థలు విద్యాశాఖ నుంచి కనీస అనుమతి పొందకుండానే అడ్మిషన్లు స్వీకరించి, గుట్టుగాతరగతులు నిర్వహిస్తున్నాయి. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నాయి. విద్యార్థి సంఘాలు ఫిర్యాదు చేసినా పట్టించుకున్న దాఖలాలు లేవు. ఏదైనా స్కూలును సీజ్ చేసినా..గంటల వ్యవధిలోనే తిరిగి తెరుచుకుంటుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సరూర్‌నగర్ మండలం చెరుకుతోట కాలనీ, కొత్తపేట న్యూమారుతీ నగర్ సహా కర్మన్‌ఘాట్‌లో గుర్తింపు లేని మూడు కార్పొరేట్ స్కూళ్లకు అధికారులు ఇటీవల నోటీసులు జారీ చేశారు. వీటిలో రెండుస్కూళ్లను సీజ్ చేశారు. చెరుకుతోట కాలనీలోని కార్పొరేట్ స్కూలు యాజమాన్యం సీజ్ చేసిన గదులకు తాళాలు పగులగొట్టి గుట్టుగా మళ్లీ తరగతులు నిర్వహిస్తోంది. ఈ విషయం తెలిసీ జిల్లా విద్యాశాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటాన్ని విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు తప్పుబడుతున్నారు. ఆర్‌జేడీ అధికారులు ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకుని, విచారణ ప్రారంభించినట్లు తెలిసింది.
ఒకే గుర్తింపుతో రెండు మూడు బ్రాంచ్‌లు
జిల్లాలో మొత్తం 2,863 స్కూళ్లు ఉండగా, వీటిలో 1,319 ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయి. వీటి పరిధిలో 6.84 లక్షల మంది విద్యాభ్యాసం సాగిస్తున్నారు. అనధికారికంగా మరో 45 స్కూళ్ల వరకు ఉన్నట్లు అంచనా. సరూర్‌నగర్, వనస్థలిపురం, మొయినాబాద్, రాజేంద్రనగర్‌లో ఈ తరహా విద్యా సంస్థలు ఎక్కువగా ఉన్నట్లు తేలింది. వీటిలో మెజార్టీ స్కూళ్లు కార్పొరేట్ సంస్థలకు సంబంధించినవే. కొన్ని యాజమాన్యాలు ఒకటి నుంచి ఏడు వరకు గుర్తింపు తీసుకుని..ఎనిమిది, తొమ్మిది తరగతులు నిర్వహిస్తుండగా.. మరికొన్ని ఏకంగా ఒకే గుర్తింపుతో రెండు మూడు చోట్ల తరగతులు నిర్వహిస్తున్నాయి. వీటికి విద్యాశాఖ నుంచి ఎలాంటి గుర్తింపు లేదు. ఈ భవనాలకు జీహెచ్‌ఎంసీ, అగ్నిమాపకశాఖల నుంచి అనుమతులు లేవు. కనీస భద్రత ప్రమాణాలు కూడా లేని భవనాల్లో పాఠశాలలు ఏర్పాటు చేయడం, గుట్టుగా తరగతులు నిర్వహిస్తూ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నాయి. ఇదిలా ఉంటే వనస్థలిపురంలోని ఓ స్కూలుకు భవన నిర్మాణానికి ముందే జీహెచ్‌ఎంసీ, ఫైర్‌శాఖల నుం చి ఎన్‌ఓసీలు రావడం, విద్యాశాఖ దానికి గుర్తింపు ఇవ్వడం వివాదాస్పదంగా మారింది. డొనేషన్ల పేరుతో విద్యార్థుల నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేయడంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందాయి. స్కూలు యాజమాన్యంపై అధికారులు చర్యలు తీసుకోకపోగా, వారి నుంచి పెద్ద మొత్తంలో నజరానాలు పొంది మద్దతుగా నిలుస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.
సరూర్‌నగర్ మండలం చెరుకుతోట కాలనీలోని ఓ స్కూల్‌కు వేసిన సీల్ (ఫైల్)
ప్రస్తుతం కొనసాగుతున్న తరగతులు
ప్రైవేట్ విద్యాసంస్థల్లో అడ్మిషన్లు
ఇటీవల ఓ స్కూల్‌ను సీజ్ చేసిన విద్యాశాఖ అధికారులు
తాళాలు పగులగొట్టితరగతుల నిర్వహణ
విద్యార్థుల జీవితాలతో చెలగాటం
అధికారుల తీరుపై విమర్శల వెల్లువ
ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తాం
త్వరలో జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తాం. విద్యాసంస్థలు నిర్వహిస్తున్న భవనాల భద్రత, ఫైర్, జీహెచ్‌ఎంసీ, మున్సిపాలిటీల నుంచి పొందిన ఎన్‌ఓసీలు, విద్యాశాఖ నుంచి పొందిన గుర్తింపు వంటి అంశాలను పరిశీలిస్తాం. నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్న పాఠశాలలపై చర్యలు తీసుకుంటాం. చెరుకుతోట కాలనీలో సీజ్ చేసిన స్కూలు రీ ఓపెన్ అయిన విషయం మా దృ ష్టికి రాలేదు. సీజ్‌ను తొలగించి..తరగతులు నిర్వహిస్తున్నట్లు తేలితే కఠిన చర్యలు తప్పవు. ప్రైవేటు పాఠశాలలకు గుర్తింపు, ఎన్‌ఓసీల జారీ విషయంలో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణల్లో వాస్తవం లేదు.
– సుశీందర్‌రావు, డీఈఓ

