మేజర్ పంచాయతీపైనే నజర్
● అత్యంత సమస్యాత్మక పంచాయతీగా ముస్తాబాద్ ● దృష్టి సారించిన పోలీస్ అధికారులు
ముస్తాబాద్(సిరిసిల్ల): జిల్లాలో సర్పంచ్ ఎన్నికలంటేనే ముస్తాబాద్ మేజర్ గ్రామపంచాయతీ గుర్తుకొస్తుంది. ఆరేళ్ల క్రితం ముస్తాబాద్ మేజర్ పంచాయతీ సర్పంచ్ ఎన్నికకు జరిగిన ఘర్షణలు, ఆందోళనలు అధికారులను కంటిమీద కునుకు లేకుండా చేశాయి. నాటి ఘటనలు ఉమ్మడి జిల్లాలో సంచలనం కల్గించాయి. గత సర్పంచ్ ఎన్నికల్లో జరిగిన ఘటనలు పునరావృతం కాకుండా ఎస్పీ మహేశ్ బీ గీతే దృష్టి సారించారు. ప్రశాంతంగా ఎన్నికలు జరిగేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈసారి ముస్తాబాద్ మేజర్ పంచాయతీ సర్పంచ్ జనరల్ అభ్యర్థులకు కేటాయించడంతో పోటీ తీవ్రంగా ఉండనుంది. మూడో విడతలో జరుగనుండడంతో బుధవారం నుంచి నామినేషన్లు మొదలయ్యాయి.
బైండోవర్లు.. కేసులు
ముస్తాబాద్ మేజర్ పంచాయతీ గత ఎన్నికల్లో పోలీసులు ఐదు కేసులు నమోదు చేశారు. ఇందులో 65 మందిపై కేసులు పెట్టారు. ఇప్పటి వరకు 15 మందిని బైండోవర్ చేయగా, మరో 50 మందిని బైండోవర్ చేయనున్నారు. 40 మంది బెల్ట్‌షాపు నిర్వాహకులను బైండోవర్ చేసి, ఒకరిపై కేసు నమోదు చేశారు. 30 యాక్ట్ అమలు చేస్తూ.. నలుగురి కంటే ఎక్కువ మంది గుమిగూడకుండా చర్యలు తీసుకుంటున్నారు.
సోషల్ మీడియాపై నిఘా
సోషల్ మీడియాపై పోలీస్ అధికారులు దృష్టి సా రించారు. వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్ట్రాగామ్‌లపై నిఘా పెట్టారు. అసత్య ప్రచారాలు చేస్తే వెంటనే అ దుపులోకి తీసుకునేలా పోలీసులు నిఘా తీవ్రం చేశారు. నామినేషన్ కేంద్రం చుట్టూ వంద మీటర్ల పరిధిలో దుకాణాలు మూసివేస్తున్నారు. ముఖ్యంగా పీపుల్స్ రిప్రజంటెంటీవ్ యాక్ట్‌ను అమలు చేస్తున్నారు. కేంద్రం వద్ద ఏఎస్సైతోపాటు పది మంది పోలీస్ సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. ఫ్లయింగ్ స్క్వాడ్ అప్రమత్తంగా ఉంది. ముస్తాబాద్‌లో 14 వార్డులు ఉండగా, 7,347 మంది ఓటర్లు ఉన్నారు. ఓటర్లు ప్రశాంతంగా తమ ఓటుహక్కు వినియోగించుకునేలా చర్యలు చేపట్టినట్లు డీఎస్పీ నాగేంద్రచా రి తెలిపారు. కౌంటింగ్ నుంచి విజేతను ప్రకటించే వరకు అధికార బృందం అప్రమత్తంగా ఉందని వి వరించారు. ఎవరైన అవాంఛనీయ ఘటనలకు పా ల్పడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


