ఆత్మస్థైర్యంతో ముందుకెళ్లాలి
● త్వరలో యూడీఐడీ కేంద్రం సేవలు ● ఇన్‌చార్జి కలెక్టర్ గరీమా అగ్రవాల్ ● ఘనంగా అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం
సిరిసిల్లటౌన్: దివ్యాంగులు ఆత్మస్థైర్యంతో ముందుకెళ్లాలని ఇన్‌చార్జి కలెక్టర్ గరీమా అగ్రవాల్ పే ర్కొన్నారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా బుధవారం స్థానిక జూనియర్ కాలేజీ మైదానంలో నిర్వహించిన దివ్యాంగుల క్రీడాపోటీలను ప్రారంభించి మాట్లాడారు. దివ్యాంగులు అన్ని రంగాల్లో రాణించాలన్నారు. అనంతరం సిరిసిల్లకు చెందిన శ్రీలక్ష్మీ వికలాంగుల సంఘానికి ఎస్‌బీఐ ఆధ్వర్యంలో రూ.8లక్షల బ్యాంక్ లింకేజ్ రుణపత్రాన్ని అందజేశారు. జిల్లా సంక్షేమాధికారి లక్ష్మీరాజం, మున్సిపల్ కమిషనర్ ఖదీర్‌పాషా, మెప్మా ఏవో మీర్జా ఫసహత్ అలీ బేగ్ పాల్గొన్నారు.
సిరిసిల్లకల్చరల్: పంచాయతీ ఎన్నికలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేశామని ఇన్‌చార్జి కలెక్టర్ గరీమా అగ్రవాల్ తెలిపారు. ఎన్నికల సంఘం రాష్ట్ర కమిషనర్ రాణీ కుముదిని హైదరాబాద్ నుంచి బుధవారం వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఇన్‌చార్జి కలెక్టర్ గరీమా అగ్రవాల్ మాట్లాడుతూ ఎన్నికల అవసరాల మేరకు బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పత్రాలు తగినన్ని ఉన్నాయన్నారు. ఎస్పీ మహేశ్ బీ గీతే స్పందిస్తూ క్రిటికల్ పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక నిఘా ఉంచుతున్నామన్నారు. జిల్లా వ్యాప్తంగా ఆరు చెక్‌పోస్టులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చూస్తున్నామన్నారు. డీఆర్వో శేషాద్రి, డీపీవో షరీఫొద్దీన్, డీడబ్ల్యూవో లక్ష్మీరాజం, జెడ్పీ డెప్యూటీ సీఈవో గీత, నోడల్ అధికారి నవీన్, ఏవో రాంరెడ్డి పాల్గొన్నారు.
నామినేషన్ కేంద్రం తనిఖీ
గంభీరావుపేట(సిరిసిల్ల): గ్రామపంచాయతీ మూడో విడత ఎన్నికల నామినేషన్ కేంద్రాన్ని ఇన్‌చార్జి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరీమ అగ్రవాల్ బుధవారం పరిశీలించారు. గంభీరావుపేటలోని ఆర్వో కేంద్రంలో నామినేషన్ల స్వీకరణను, కేజీ టు పీజీ స్కూల్ ఆవరణలో ఏర్పాటు చేయనున్న పోలింగ్ కేంద్రాన్ని తనిఖీ చేశారు. అనంతరం ప్రాథమిక పాఠశాల విద్యార్థులతో మాట్లాడారు. మధ్యాహ్న భోజనం మెనూపై ఆరా తీశారు. తహసీల్దార్ మారుతిరెడ్డి, ఇన్‌చార్జి ఎంపీడీవో శ్రీధర్ పాల్గొన్నారు.


