
మెనూ.. వసతిపై ఆరా
● వసతిగృహాలు తనిఖీ చేసిన కలెక్టర్ ● వంటగదులు, ఆహార పదార్థాల పరిశీలన
సిరిసిల్ల: జిల్లాలోని పలు ప్రభుత్వ సంక్షేమ వసతిగృహాలను, గురుకులాలను కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా గురువారం రాత్రి తనిఖీ చేశారు. సిరిసిల్ల శివారులోని చిన్నబోనాల గురుకులం, పెద్దూర్ మహాత్మాజ్యోతి బాపూలే వసతి గృహం, తంగళ్లపల్లి మండలం మండెపల్లిలోని మైనార్టీ బాలుర హాస్టల్, నేరెళ్లలోని బాలికల రెసిడెన్షియల్ విద్యాలయాలను తనిఖీ చేశారు. గురుకులాల్లోని పరిసరాలు, కిచెన్, నిలువ చేసిన ఆహార పదార్థాలు, పండ్లు పరిశీలించారు. మండెపల్లిలోని మైనార్టీ బాలుర వసతి గృహంలో సౌకర్యాలు సరిపడా లేకపోవడంతో వారికి కేంద్రీయ విద్యాలయానికి సంబంధించిన గత భవనాన్ని వినియోగించాలని సూచించారు. పెద్దూర్, మండెపల్లిలోని ఆర్వో ప్లాంట్లు రెండు రోజుల్లో వినియోగంలోకి తీసుకురావాలని సూచించారు. తాజా, నాణ్యమైన కూరగాయలు, పండ్లు అందుబాటులో ఉంచాలని సూచించారు. మెనూ ప్రకారం విద్యార్థులకు ఆహార పదార్థాలు వడ్డించాలని ఆదేశించారు. హాస్టల్ ఆవరణ, వంట గదులు పరిశుభ్రంగా ఉండాలని స్పష్టం చేశారు. పరిసరాల పరిశుభ్రత కోసం మున్సిపల్, పంచాయతీ అధికారులతో పని చేయించాలని సూచించారు. విద్యార్థులకు సరిపడా టాయిలెట్లు, బెడ్స్, డెస్క్‌లు ఉన్నాయని ఆ విద్యాసంస్థల బాధ్యులను అడిగి తెలుసుకున్నారు. ఈగలు, దోమలు రాకుండా ఎలక్ట్రిక్ మిషన్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. జిల్లా విద్యాధికారి వినోద్‌కుమార్, డీపీఆర్వో శ్రీధర్, ఆయా విద్యాసంస్థల ప్రిన్సిపాల్ తదితరులు ఉన్నారు.