
కలెక్టర్ రావాలి.. సమస్యలు పరిష్కరించాలి
తంగళ్లపల్లి(సిరిసిల్ల): కలెక్టర్ వచ్చి.. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ తంగళ్లపల్లిలోని గిరిజన ఆర్ట్స్ కాలేజీ విద్యార్థినులు రెండో రోజు గురువారం ధర్నాకు దిగారు. తంగళ్లపల్లి మండల కేంద్రంలోని తెలంగాణ గిరిజన సంక్షేమ డిగ్రీ, ఫైన్ ఆర్ట్స్ కళాశాల విద్యార్థినులు తమ సమస్యల పరిష్కారం కోసం బుధవారం మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై ధర్నాకు దిగిన విషయం తెలిసిందే. కాగా రెండో రోజు సైతం విద్యార్థినులు నిరసన చేపట్టారు. కళాశాల గేట్‌కు ప్రిన్సిపాల్ తాళం వేయించడంతో.. గేటు లోపల ధర్నా చేశారు. ‘స్టాప్ ఇగ్నోరింగ్ స్టార్ట్ టీచింగ్, వన్ టీచర్ నాట్ ఎనఫ్, వీ నీడ్ ఆన్సర్, వీ వాంట్ జస్టిస్’ అంటూ ఫ్లకార్డులు ప్రదర్శించారు. తంగళ్లపల్లి తహసీల్దార్ జయంత్‌కుమార్, ఎస్సై ఉపేంద్రచారి కళాశాలకు చేరుకుని సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు.
● ధర్నాకు దిగిన గిరిజన విద్యార్థినులు