
ఆటో కార్మికుల భిక్షాటన
సిరిసిల్లటౌన్: రాష్ట్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ గురువారం సిరిసిల్లలో ఆటోకార్మికులు భిక్షాటన చేపట్టారు. భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు వెంగళ శ్రీనివాస్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రావడానికి అడ్డగోలు హామీలు ఇచ్చి అరచేతిలో వైకుంఠం చూపించి ఆటో కార్మికులను రోడ్డుపాలు చేసిందన్నారు. ఏడాదికి రూ.12వేలు ఇస్తామని హామీ ఇచ్చి రెండేళ్లు సమీపిస్తున్నా నెరవేర్చకపోవడం బాధాకరమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో కార్మికులకు రూ.24వేలు బాకీ పడిందన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో మహాలక్ష్మి పథకం వచ్చిన తర్వాత ఉపాధి కరువై 142 మంది ఆటోకార్మికులు ఆత్మహత్య చేసుకున్నారన్నారు. కన్కం శ్రీనివాస్, సలీం, పులి నాగరాజు, గాండ్ల శ్రీనివాస్, చింత విక్కీ, మల్యాల దేవరాజ్, రేగుల రవి పాల్గొన్నారు.