భార్య అంత్యక్రియలకు డబ్బుల్లేక..
నాలుగు రోజులుగా జీజీహెచ్ వద్ద ఓ రిక్షా కార్మికుడి ఆవేదన ఇద్దరు పిల్లలతో చలిలో వణుకుతూ అరుగుల మీద నిద్ర రిమ్స్ మార్చురీలోనే మృతదేహం
ఒంగోలు టౌన్: అతడి పేరు యోహాన్. నెల్లూరు జిల్లా కందుకూరులో రిక్షా తొక్కుతూ భార్యా బిడ్డలను పోషిస్తుంటాడు. పామూరు మండలంలోని బోడవాడ స్వగ్రామం. భార్య జాను, ఇద్దరు పిల్లలతో నిన్నా మొన్నటి వరకు సంతోషంగా సాగిన కాపురంలో విషాదం చోటుచేసుకుంది. భార్యా జాను కొద్ది రోజుల క్రితం అనారోగ్యం పాలైంది. పగలంతా రిక్షా తొక్కితే వచ్చే డబ్బులతో పొట్ట నింపుకోవడానికే సరిపోతున్నాయి. ఇక వైద్యం చేయించే పరిస్థితి లేకపోవడంతో ఒంగోలులోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో వైద్యం చేయించసాగాడు. నెల రోజులుగా జీజీహెచ్‌లో భార్యకు చికిత్స చేయిస్తున్నాడు. అయినా ప్రయోజనం లేకుండా పోయింది. బుధవారం జాను ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయింది. దాంతో యోహను గుండె పగిలిపోయింది. పాపం పుణ్యం తెలియని ఇద్దరు చిన్నారులను గుండెలకత్తుకొని గుక్కపట్టి ఏడ్చాడు. జాను మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. నాలుగు రోజులవుతోంది. భార్య మృతదేహాన్ని సొంత ఊరుకు తీసుకెళ్లి అంత్యక్రియలు చేసేందుకు చేతిలో చిల్లిగవ్వలేదు. కనిపించని దేవుడికి మొక్కుకున్నాడు. కనికరించలేదు. కళ్ల ముందు కనిపించిన ప్రతి ఒక్కరినీ ప్రాధేయపడ్డాడు. ఒక్కరూ దయతలచ లేదు. దాంతో ఇద్దరు చిన్నారులను తీసుకొని పగలు రాత్రి మార్చూరీ చుట్టే తిరుగుతున్నాడు. ఎవరైనా ఓ ముద్ద పెడితే పిల్లలకు తినిపిస్తున్నాడు. లేకపోతే పస్తులతో పడుకోబెడుతున్నాడు. అమ్మ కావాలని అడుగుతున్న చిన్నారులకు సర్ది చెప్పలేక సతమతమవుతున్నాడు. ఎవరైనా దాతలు ముందుకొచ్చి సాయం చేస్తే భార్య జాను మృతదేహాన్ని స్వగ్రామం బోడపాడుకు తరలించి అంత్యక్రియలు చేసుకుంటానని ప్రాధేయ పడుతున్నాడు.


