108లో కవలలు జననం
దర్శి: స్థానిక సీహెచ్‌సీలో వైద్యులు ఓ గర్భిణికి కాన్పు చేయలేమని చేతులెత్తేశారు. ఒంగోలు తీసుకెళ్లాలని బంధువులకు సలహా ఇచ్చారు. చేసేది లేక 108లో ఒంగోలు తీసుకెళ్తుండగా మార్గమధ్యంలో 108 సిబ్బంది కాన్పు చేశారు. ఆమె కవలలకు జన్మనిచ్చింది. ఈ సంఘటన శనివారం వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని అబ్బాయిపాలెం గ్రామానికి చెందిన తిరుపతమ్మకు పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు 108కి సమాచారమిచ్చారు. దర్శి 108 సిబ్బంది వెంకటరెడ్డి, గౌస్‌బాషాలు సంఘటన స్థలానికి చేరుకొని ఆమె దర్శి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడి వైద్యులు తిరుపతమ్మకు కడుపులో కవల పిల్లలు ఉన్నారని, కవలలు ఉండటంతో పాటు రక్తహీనత కలిగి ఉందని చెప్పి ఒంగోలు రిమ్స్‌కు రిఫర్ చేశారు. అక్కడి నుంచి మళ్లీ 108లో ఒంగోలు వెళ్తుండగా మార్గమధ్యంలో నొప్పులు అధికమయ్యాయి. వెల్లంపల్లి సమీపంలో వాహనాన్ని పక్కకు ఆపి ఎంటీ, ఫైలెట్‌లే కాన్పు చేశారు. 15 నుంచి 20 నిమిషాల వ్యవధిలో కవల పిల్లలు 108లోనే జన్మించారు. ఆ వెంటనే తల్లి, పిల్లలను ఒంగోలు రిమ్స్ వద్ద క్షేమంగా వదిలి పెట్టారు. అక్కడి వైద్యులు వారికి వైద్య పరీక్షలు చేశారు. తల్లి, పిల్లలకు ప్రమాదం లేకుండా కాన్పు చేసిన 108 సిబ్బంది గౌస్‌బాషా, వెంకటరెడ్డిలను ఓఈ మహేష్ అభినందించారు.


