శ్రీశైలం ఘాట్‌లో ప్రమాదం
ెపద్దదోర్నాల: వేగంగా వస్తున్న ఓ కారు తొలుత కొండను.. ఆ తర్వాత బస్సును ఢీకొని రోడ్డుకు అడ్డంగా బోల్తా పడింది. కారులో ఉన్న ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. వాహనాల రాకపోకలకు కొంత అంతరాయం ఏర్పడగా పెను ప్రమాదమే తప్పింది. ఈ సంఘటన శ్రీశైలం రహదారిలోని చింతల సమీపంలో శనివారం జరిగింది. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ప్రమాదానికి సంబంధించిన వివరాలు సేకరించారు. అందిన వివరాల ప్రకారం.. ఏలూరుకు చెందిన కొందరు శ్రీశైలంలో దైవ దర్శనం ముగించుకుని తిరుగు ప్రయాణంలో చింతల వద్దకు చేరుకున్నారు. ఈ క్రమంలో వారు ప్రయాణిస్తున్న కారు తొలుత కొండను, అనంతరం ఎదురుగా వస్తున్న మార్కాపురం డిపో లగ్జరీ బస్సును ఢీకొట్టి బోల్తా పడింది. ఈ క్రమంలో శ్రీశైలం వెళ్తున్న నంద్యాల జిల్లా పోలీసులు రోడ్డుకు అడ్డంగా బోల్తా పడిన కారును తొలగించి రాకపోకలను పునరుద్ధరించారు. అనంతరం సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
బస్సును ఢీకొని బోల్తా పడిన కారు


