పెళ్లి ఇంట్లో దొంగతనం
● 7 సవర్ల బంగారం, రూ.4.73 లక్షల నగదు చోరీ
చీమకుర్తి: జెడ్పీటీసీ సభ్యుడు వేమా శ్రీనివాసరావు ఇంట్లో చోరీ జరిగింది. 6 సవర్ల బంగారు పూలహారం, 7 గ్రాముల ఉంగరం, రూ.4.73 లక్షల నగదును దొంగలు అపహరించినట్లు ఆయన శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుదారుడు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 27వ తేదీ రాత్రి వేమా శ్రీనివాసరావు తన కుమారుడి వివాహాన్ని చీమకుర్తిలోని బీవీఎస్‌ఆర్ కల్యాణ మండపంలో నిర్వహించారు. అదే రాత్రి 12 గంటల వరకు కల్యాణ మండపం వద్ద ఉన్నారు. అనంతరం పెళ్లి కార్యక్రమాన్ని ముగించుకొని కూనంనేనివారిపాలెంలోని తన నివాసానికి వెళ్లారు. ఇంటి వెనుక తలుపులు తెరిచి బీరువాను ధ్వసం చేసినట్లు గుర్తించారు. బీరువాలో ఉంచిన 6 సవర్ల బంగారు పూలహారం, 7 గ్రాముల ఉంగరంతో పాటు రూ.4.73 లక్షల నగదు కనిపించటం లేదని అదే రోజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. క్లూస్ టీమ్ వచ్చి వేలిముద్రలు సేకరించింది. పోలీసులకు ఫిర్యాదు చేసిన తర్వాత వేమా శ్రీనివాసరావు వధూవరులతో కలిసి తిరుపతి వెళ్లాల్సి ఉండటంతో వెళ్లి తిరిగి వచ్చి శనివారం పోలీసుస్టేషన్‌లో రాతపూర్వకంగా ఫిర్యాదు చేశౠరు. కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు సీఐ దాసరి ప్రసాద్ తెలిపారు.


