బడుగుల ఇళ్లు కూలగొట్టి..
మేయర్ ఇంటికి డ్రైనేజీ కోసం పేదలపై ప్రతాపం ఆరు అడుగుల లోతు డ్రైనేజీ గోతులు 30 అడుగుల రోడ్డుకు పడమరగా ఉన్న ప్రభుత్వ స్థలాన్ని కాదని.. గంజాయి కేసులు పెడతామని బెదిరిస్తున్న నాయకులు
ఒంగోలు సబర్బన్: ఆమె నగర ప్రథమ పౌరురాలు...ఆమె ఇంటికి డ్రైనేజీ సౌకర్యం కోసం పేదలపై ప్రతాపం చూపిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా చెరువుకొమ్ముపాలెంలో డ్రైనేజీ నిర్మాణం చేపడుతున్నారు. అడ్డగోలుగా బడుగుల రేకుల షెడ్లను నిలువునా కూల్చేశారు. రోడ్డుకు అవతల వైపున ఉన్న డ్రైనేజీని కాదని కూలీ నాలీ చేసుకునే పేదల ఇళ్లు నేలమట్టం చేశారు. కార్పొరేషన్ ఎన్నికల్లో ఇంటింటికీ వెళ్లి ఓట్లేయమని అడిగిన ఆమె నేడు ఇళ్లు కూలగొట్టంపై ఆగ్రహం వ్యక్తమవుతున్నాయి. వివరాలు ఇలా ఉన్నాయి. చెరువుకొమ్ముపాలెం గ్రామంలో మేయర్‌కు చెందిన భారీ భవనం ఉంది. ఆ భవనం ఆనుకొని పాత కల్వర్టులు, డ్రైనేజీ ఉంది. అది చెరువుకొమ్ముపాలెం గ్రామంలోకి వెళ్లే రోడ్డుకు మేయర్ భవనం ఉత్తరం వైపు ఉంటుంది. ఆ వైపు డ్రైనేజీ తీస్తే మేయర్ భవనం సగానికి కూలగొట్టాలి. ఆమేరకు గతంలో ఎక్కడి వరకు కూలగొట్టాలో మున్సిపల్ ఇంజినీరింగ్ అధికారులు మార్కింగ్ కూడా చేశారు. దాంతో భవనం కూలగొడితే చాలా నష్టపోవాల్సి వస్తుందని భావించిన ఆమె పేదల ఇళ్లను టార్గెట్ చేశారు. పాత డ్రైనేజీ ఉన్నా ఇటీవల రూ.40 లక్షల అంచనాలతో డ్రైనేజీ నిర్మాణానికి కౌన్సిల్‌లో ఆమోదం చేయించుకున్నారు. అడ్డగోలుగా డ్రైనేజీ నిర్మాణం చేసుకుంటూ 26 మంది బడుగుల ఇళ్లు కూల్చివేస్తున్నారు. 30 అడుగుల రోడ్డుకు పడమరగా ప్రభుత్వ స్థలం ఉంది. అది కాదని పేదలు ఉంటున్న ఇళ్లను కూల్చివేసి ఆరు అడుగుల లోతులో భారీ డ్రైనేజ్ నిర్మిస్తున్నారు కార్పొరేషన్ అధికారులు. ఇదేం అన్యాయం అంటూ వారు అధికారులను వేడుకుంటున్నా పట్టించుకోకుండా పనులు చేపట్టారు. ఇదేమని అడిగితే గంజాయి కేసుపెట్టి ఇరికిస్తానని మేయర్ అనుచరుడు బెదిరిస్తున్నాడన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పోలీసులను అడ్డంపెట్టుకొని పేదలపై ప్రతాపం చూపిస్తుండడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కౌన్సిల్ తీర్మానం ప్రకారమే డ్రైనేజీ నిర్మాణం..
చెరువుకొమ్ముపాలెం గ్రామంలోని కొత్తపాలెం వద్ద ఒంగోలు కార్పొరేషన్ కౌన్సిల్ తీర్మానం ప్రకారమే డ్రైనేజీ నిర్మిస్తున్నామని ఒంగోలు నగర పాలక సంస్థ ఇంజినీర్ ఏసయ్య తెలిపారు. మేయర్ సుజాతకు చెందిన భవనానికి ఆనుకొని ఉన్న పాత డ్రైనేజీని కాదని ఎందుకు కొత్త డ్రైనేజీని తీస్తున్నారని అడిగిన ప్రశ్నకు పాత డ్రైనేజీతో తమకు సంబంధం లేదని, మేయర్ తీర్మానం చేసిన కౌన్సిల్ ఆమోదం ప్రకారం ఇళ్లు తొలగించి పెద్ద డ్రైనేజీ నిర్మాణాన్ని చేపడుతున్నామన్నారు. గతంలో చేసిన మార్కింగ్‌ను కాదని మేయర్ భవనం కూలగొట్టాల్సి వస్తుందని రోడ్డుకు అవతల వైపు డ్రైనేజీ తీస్తున్నారా అని అడిగిన ప్రశ్నకు సమాధానం దాటవేశారు. కాంట్రాక్టర్ కాకుండా స్థానిక నాయకుడు సుధాకర్ వచ్చి మరీ ప్రజలను భయపెట్టి పొక్లెయిన్‌తో రేకుల షెడ్డులు కూలగొట్టించారట కదా అని అడిగిన ప్రశ్నకు ఆ విషయం తమకు సంబంధం లేదని సమాధానం ఇచ్చారు.
బడుగుల ఇళ్లు కూలగొట్టి..


