కార్మికులను బానిసలుగా మార్చే లేబర్‌ కోడ్‌లు | - | Sakshi
Sakshi News home page

కార్మికులను బానిసలుగా మార్చే లేబర్‌ కోడ్‌లు

Nov 30 2025 6:48 AM | Updated on Nov 30 2025 6:48 AM

కార్మికులను బానిసలుగా మార్చే లేబర్‌ కోడ్‌లు

కార్మికులను బానిసలుగా మార్చే లేబర్‌ కోడ్‌లు

ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు రాధా కృష్ణమూర్తి

ఒంగోలు టౌన్‌: కార్మికులను కార్పొరేట్‌ శక్తుల కట్టుబానిసలుగా మార్చేందుకే కేంద్రంలోని మోదీ ప్రభుత్వం నాలుగు లేబర్‌ కోడ్లు తీసుకొచ్చిందని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు రాధా కృష్ణమూర్తి అన్నారు. స్థానిక మల్లయ్యలింగం భవనంలో ఏఐటీయూసీ జిల్లా స్థాయి విస్తృత సమావేశం శనివారం నిర్వహించారు. ఈ సమావేశానికి సయ్యద్‌ యాసిన్‌ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా రాధా కృష్ణమూర్తి మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 12 ఏళ్లలో కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని విమర్శించారు. కార్మిక లోకం ఎన్నో త్యాగాలతో సాధించుకున్న హక్కులను కాలరాస్తున్న మోదీ సర్కార్‌ చరిత్రలో చేతులు కట్టుకొని నిలబడక తప్పదని హెచ్చరించారు. నాలుగు లేబర్‌ కోడ్లకు వ్యతిరేకంగా కోట్లాది మంది కార్మికులు రోడ్లమీదకు వచ్చి నిరసనలు, ఆందోళనలు, ధర్నాలు చేస్తున్నా మోదీ సర్కార్‌కు చీమకుట్టినట్టయినా లేదని, ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటోందని ధ్వజమెత్తారు. దేశ సంపదను కార్పొరేట్‌ శక్తులకు దోచిపెడుతున్న మోదీ వారికి ప్రయోజనం కలిగించేందుకే నాలుగు లేబర్‌ కోడ్లు తీసుకొచ్చారని చెప్పారు. కార్పొరేట్లకు కోరిన వెంటనే ఉచితంగా భూములను పంచిపెడుతున్నారని, చట్టాలను వారికి చుట్టాలుగా మారుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకట సుబ్బయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అమలు చేస్తోందని విమర్శించారు. 8 గంటల పనివిధానానికి స్వస్తి పలికి 13 గంటల పనివిధానాన్ని తీసుకొచ్చారని చెప్పారు. పనిచేయకుండా కార్మికులకు వేతనాలు ఇస్తారా అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. కార్మికులు ఏడాదికి రూ.400 కోట్లకు పైగా సంపద సృష్టిస్తున్నారని తెలిపారు. అయినా కార్మికులకు ఎలాంటి ప్రయోజనాలు సిద్ధించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పర్మినెంట్‌ ఉద్యోగాల స్థానంలో ఔట్‌ సోర్సింగ్‌, కాంట్రాక్ట్‌ ఉద్యోగాలు తీసుకొస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో ఉన్న ఏకై క ప్రభుత్వ రంగ సంస్థ విశాఖ ఉక్కుకు సొంత గనులు కేటాయించకపోవడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. ఎన్నికల ముందు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను అడ్డుకుంటామని హామీ ఇచ్చిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత నాటకాలాడుతున్నారని మండిపడ్డారు. కార్మికులు, అసంఘటిత కార్మికుల సంక్షేమం కోసం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో జరుగుతున్న పోరాటాల్లో ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి ఎంఎల్‌ నారాయణ, కొత్తకోట వెంకటేశ్వర్లు, కాటన్‌ శెట్టి హనుమంతరావు, సుభాన్‌ నాయుడు, పుల్లమ్మ, దాసరి మల్లికార్జునరావు, దాసరి సునిత, కె.అంజయ్య, వివిధ రంగాలకు చెందిన కార్మికులు, పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement