రేయింబవళ్లుతవ్వుడు.. తోలుడే..!
అధికారుల మౌనంతో
రాష్ట్ర ఖజానాకు నష్టం
పాలేరును చెరబట్టిన ‘పచ్చ’ ముఠా
రాష్ట్ర ఖజానాకు గండి కొట్టి రూ.10 కోట్ల పైగా పోగేసిన టీడీపీ ముఠా
కొండపి:
విచ్చలవిడిగా ఇసుక అక్రమ దందా సాగిస్తున్న టీడీపీ ముఠాను కట్టడి చేయడంలో ప్రభుత్వ అధికార యంత్రాంగం ఘోరంగా విఫలమైంది. ఇసుక లారీలపై దాడి చేస్తే ఎక్కడ తమపై రెడ్ బుక్ ప్రయోగిస్తారోనన్న భయం కొందరిదైతే, సంపాదన యావలో పడి మరికొందరు అధికారులు పచ్చ ముఠా ఇసుక దోపిడీని గుడ్లప్పగించి చూస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొండపి నియోజకవర్గంలోని జరుగుమల్లి, పొన్నలూరు మండలాల పరిధిలో ప్రవహించే పాలేరులో ఇసుకను టీడీపీ నాయకులు కొల్లగొడుతున్నారు. గడిచిన 4 నెలలుగా రాత్రి, పగలు అనే తేడా లేకుండా పాలేరులో ఇసుకను జేసీబీలతో తవ్వి, యథేచ్ఛగా టిప్పర్లతో తరలిస్తున్నారు. నిత్యం 3 నుంచి 4 జేసీబీలు పాలేరులో ధ్వంసరచన చేస్తున్నాయి. రోజూ 40 టిప్పర్లకు పైగా ఇసుక అక్రమంగా కొండపి నియోజకవర్గంతోపాటు జిల్లాలోని వేర్వేరు ప్రాంతాలకు తరలిపోతోంది. జరుగుమల్లి, పొన్నలూరు పరిధిలో తవ్విన ఇసుకను కొండపి మీదుగా చీమకుర్తి, సంతనూతలపాడు, మర్రిపూడి, పొదిలి వైపు తరలిస్తూ టీడీపీ నేతలు దండిగానే సంపద పోగేసుకుంటున్నారని స్థానికులు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. గడిచిన 4 నెలల్లో మోంథా తుఫాన్ సమయంలో 2 రోజులు మినహా మిగిలిన అన్ని రోజులూ ఇసుక అక్రమ రవాణా సాగింది. గురు, శుక్రవారాల్లో సైతం యథేచ్ఛగా ఇసుక తరలిపోయింది. మొత్తం మీద ఇప్పటి వరకు 4800 టిప్పర్ల ఇసుకను టీడీపీ నేతలు అక్రమంగా తరలించినట్లు కొండపి, జరుగుమల్లి, పొన్నలూరు మండలాల్లో ప్రజలు చర్చించుకుంటున్నారు. ఈ లెక్కన చూస్తే టీడీపీ నేతలు పోగేసుకున్న సొమ్ము రూ.10 కోట్లకు పైగానే ఉంటుందని అంచనా.
ధ్వంసమవుతున్న రోడ్లు
ఇసుకను ఓవర్ లోడ్ చేసిన లారీలు, టిప్పర్లు కామేపల్లి నుంచి కొండపి వైపు రావడంతో రోడ్లు ధ్వంసమవుతున్నాయి. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఇప్పటికే దెబ్బతిన్న ఇసుక లారీల కారణంగా మరింత గుల్లవుతున్నాయి. కామేపల్లి–నేతివారిపాలెం మధ్య రోడ్డు, కొండపి–అన్నకర్లపూడి మధ్య రోడ్డు ధ్వంసం కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
గత వైఎస్సార్ సీపీ హయాంలో ఇసుకను నేరుగా ప్రభుత్వమే విక్రయించగా
రాష్ట్ర ఖజానాకు భారీగా ఆదాయం
సమకూరింది. అయితే చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే
ఇసుకను టీడీపీ నేతలకు ఆదాయ
వనరుగా మార్చేశారు. టీడీపీ ముఖ్య నేతల ఆదేశాలతో అధికారులు మౌనం దాల్చడంతో ఆ పార్టీ నాయకుల ఇసుక దందాకు అడ్డూఅదుపు లేకుండా
పోయింది. ఫలితంగా రాష్ట్ర ఖజానాకు భారీగా గండి పడుతోంది. రాష్ట్ర రెవెన్యూ ప్రభుత్వ ఉద్యోగుల జీతానికే సరిపోతోందని ఓ వైపు సన్నాయి నొక్కులు నొక్కుతున్న ప్రభుత్వ పెద్దలు.. ఆదాయాన్ని పెంచే మార్గాలను గాలికొదిలేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
రేయింబవళ్లుతవ్వుడు.. తోలుడే..!
రేయింబవళ్లుతవ్వుడు.. తోలుడే..!


