ఖేలో ఇండియా పోటీల్లో మెరిసిన ఏకేయూ విద్యార్థి
● అఖిల భారత స్థాయిలో రజత పతకం కై వసం
ఒంగోలు సిటీ: రాజస్థాన్ రాష్ట్రంలోని బిఖనూర్‌లో ఈ నెల 24 నుంచి నిర్వహిస్తున్న ఖోలో ఇండియా పోటీల్లో వెయిట్ లిఫ్టింగ్‌లో ఆంధ్ర కేసరి యూనివర్సిటీకి చెందిన ఎన్.వెంకట మహేష్ ప్రతిభ కనబరిచాడు. సీఎస్ పురంలోని బెల్లంకొండ డిగ్రీ కళాశాల ద్వితీయ సంవత్సరం విద్యార్థి మహేష్ గురువారం నిర్వహించిన 79 కిలోల విభాగం వెయిట్ లిఫ్టింగ్ ఫైనల్స్‌లో జాతీయ స్థాయిలో రన్నరప్‌గా నిలిచి రజత పతకం కై వసం చేసుకున్నాడు. ఈ సందర్భంగా మహేష్‌కు వైస్ చాన్సలర్ డీవీఆర్ మూర్తి, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ బి.హరిబాబు, ఫిజికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ దేవీ వరప్రసాద్ అభినందనలు తెలిపారు.
● 16 మంది జూదరులు అరెస్టు
● రూ.3,18,086 నగదు, 19 ఫోన్లు, 21 బైకులు సీజ్
ముండ్లమూరు(దర్శి): మండలంలోని నూజిల్లపల్లి–శంకరాపురం గ్రామాల మధ్య పొలాల్లో కోతముక్క ఆడుతున్న 16 మందిని శుక్రవారం అరెస్టు చేసినట్లు ఎస్సై కె.కమలాకర్ తెలిపారు. ఎస్సై కథనం మేరకు.. దర్శి డీఎస్పీ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో ముండ్లమూరు, తాళ్లూరు మండలాల పోలీసు సిబ్బంది కలిసి పొలాల్లో పేకాట శిబిరాన్ని చుట్టుముట్టారు. సంఘటన స్థలంలో పట్టుబడిన నిందితుల నుంచి రూ.3,18,086 నగదు, 19 సెల్‌ఫోన్లు, 21 మోటారుసైకిళ్లు, పేకముక్కలు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. నిందితులను కోర్టులో హాజరుపరచనున్నట్లు తెలిపారు.
ఒంగోలు టౌన్: టంగుటూరు ఎమ్మార్వో కార్యాలయం 27 ఏళ్ల క్రితం తగలబడిన కేసును ప్రిన్సిపల్ అసిస్టెంట్ సెషన్స్ జడ్జి కొట్టివేస్తూ తీర్పు వెలువరించారు. 1998వ సంవత్సరంలో టంగుటూరు ఎమ్మార్వో కార్యాలయం దగ్ధమైంది. ఈ ఘటనకు సంబంధించి ఎమ్మార్పీఎస్ నాయకులు, కార్యకర్తలు 25 మంది మీద పోలీసులు కేసు నమోదు చేశారు. మందకృష్ణమాదిగ, కొమ్మూరి కనకారావు, పేరుపోగు వెంకటేశ్వరరావు, చాట్ల రమేష్ దొరకకపోవడంతో కేసు స్పిటప్ చేశారు. గర్నెపూడి సుబ్బారావు తదితరుల మీద కేసును విచారించి 2017లో కొట్టివేశారు. ముద్దాయిలుగా మిగిలిన కొమ్మూరి కనకారావు, పేరుపోగు వెంకటేశ్వరరావు, చాట్ల రమేష్ మీద కేసు విచారణ సుదీర్ఘ కాలం కొనసాగింది. శుక్రవారం తుది విచారణ చేపట్టిన ప్రిన్సిపల్ అసిస్టెంట్ సెషన్స్ జడ్జి ఎస్.హేమలత కేసును కొట్టివేస్తూ తీర్పు వెలువరించారు. ఈ సందర్భంగా కొమ్మూరి కనకారావు మాట్లాడుతూ.. ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా కేసును వాదించి అండగా నిలిచిన న్యాయవాది పిట్టల లక్ష్మయ్య, జూనియర్ న్యాయవాదులు నాగేశ్వరరావు, పార్వతి, యగ్నేశ్వరరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
ఒంగోలు వన్‌టౌన్: వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖఽ ఆధ్వర్యంలో నిర్వహించనున్న సివిల్ సర్వీసెస్ పరీక్షల ఉచిత శిక్షణకు డిసెంబర్ 3వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ ఎస్.నిర్మలా జ్యోతి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ కులాలకు చెందిన అభ్యర్థులకు డిసెంబర్ 7వ తేదీన స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించనున్నట్లు చెప్పారు. అర్హత సాధించిన అభ్యర్థులకు డిసెంబర్ 14వ తేదీ నుంచి విజయవాడ నగరంలోని గొల్లపూడిలో ఏపీ బీసీ స్టడీ సర్కిల్‌లో శిక్షణ తరగతులు నిర్వహిస్తారని పేర్కొన్నారు. అభ్యర్థులు తమ దరఖాస్తులను కలెక్టరేట్ ఎదురుగా ఉన్న గవర్నమెంట్ ఆఫీస్ కాంప్లెక్స్‌లో ఏపీ బీసీ స్టడీ సర్కిల్ కార్యాలయంలో అందజేయాలని స్పష్టం చేశారు. వివరాలకు 08592–231232, 9989285530, 8985090926ను సంప్రదించాలని సూచించారు.
● మహిళలతో వ్యభిచారం చేయిస్తున్న ముఠా
కొనకనమిట్ల: పేద మహిళల అవసరాలను ఆసరాగా తీసుకున్న ఓ ముఠా.. ఆ అభాగ్యురాళ్లను పడుపు వృత్తిలోకి దించుతోంది. జాతీయ రహదారి పక్కన ఖాళీ స్థలాలను తమ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మార్చేసింది. పట్టపగలే బహిరంగంగా వ్యభిచారం చేయిస్తున్నా హైవే పెట్రోలింగ్ సిబ్బంది, మండల పోలీసులు సైతం పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొనకనమిట్ల మండలం పెదారికట్ల గ్రామ శివారు నందనమారెళ్ల కొండ సమీపంలో గత కొంత కాలంగా పట్టపగలే మహిళలతో వ్యభిచారం చేయిస్తుండటంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అద్దంకి ప్రాంతానికి చెందిన పలువురు మహిళలను పెదారికట్ల సమీపంలోని కొండ ప్రాంతానికి తీసుకొచ్చి వ్యభిచార రొంపిలోకి దించుతున్నట్లు సమాచారం. వీరి చర్యలతో కొండ సమీపంలోని పొలాల రైతులు, మహిళలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. పోలీసులు స్పందించి హైవే వెంట అసాంఘిక చర్యలను కట్టడి చేయాలని పెదారికట్ల వాసులు కోరుతున్నారు.
ఖేలో ఇండియా పోటీల్లో మెరిసిన ఏకేయూ విద్యార్థి
ఖేలో ఇండియా పోటీల్లో మెరిసిన ఏకేయూ విద్యార్థి


