భక్తుల మనోభావాలతో ఆటలా?
పొదిలి రూరల్: మార్కాపురాన్ని జిల్లా చేశారన్న సంతోషం కంటే పొదిలి మండల పరిధిలో ఉండే పృథులగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని కొండపి నియోజకవర్గ పరిధిలోకి తీసుకెళ్లడం బాధగా ఉందని, ప్రజలు, భక్తుల మనోభావాలు దెబ్బతీసే చర్యలు సరికాదని వైఎస్సార్ సీపీ మార్కాపురం ఇన్‌చార్జీ, మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు పేర్కొన్నారు. శుక్రవారం మాజీ ఎమ్మెల్యే ఉడుముల శ్రీనివాసరెడ్డితో కలిసి పొదిలిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అన్నా రాంబాబు మాట్లాడారు. తరతరాల చరిత్ర, బ్రిటీష్ వారి హయాం, వెంకటగిరి రాజా పాలన, ఫారెస్టు రికార్డులు, దేవదాయశాఖ రికార్డులు.. ఇలా ఏది చూసినా పృథులగిరి పొదిలి మండల పరిధిలో ఉందని స్పష్టం చేస్తున్నాయన్నారు. ఆ గుడి బాధ్యతలు పొదిలి గ్రూప్ టెంపుల్స్ ఈఓనే చూస్తున్నారని గుర్తు చేశారు. ఇవేవీ పరిశీలించకుండా అధికారం ఉంది కదా అని పృథులగిరి ఆలయాన్ని రాష్ట్ర మంత్రి డీబీవీ స్వామి తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కొండపి నియోజకవర్గంలోకి లాగేసుకోవడం అన్యాయమన్నారు. మంత్రి స్వామి అనైతిక చర్యను మార్కాపురం ఎమ్మెల్యే ఎందుకు ఖండించలేదని ప్రశ్నించారు. ఇప్పటి వరకు ఆ ఆలయ కమిటీని మార్కాపురం ఎమ్మెల్యేగా ఎవరుంటే వారే పర్యవేక్షిస్తుంటారన్నారు. ఇప్పటికై నా స్థానిక ఎమ్మెల్యే జోక్యం చేసుకుని ప్రజల మనోభావాలు దెబ్బతినకుండా చూడాలన్నారు. నరసింహస్వామి ఆలయం పొదిలి పరిధిలో ఉండే విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. ప్రజల మనోభావాలను పరిగణలోకి తీసుకోకుండటే వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో పోరాటం చేస్తామని అన్నా రాంబాబు హెచ్చరించారు. సమావేశంలో పార్టీ పట్టణాధ్యక్షుడు గుజ్జుల సంజీవరెడ్డి, నాయకులు జి.శ్రీనివాసులు, ఉడుముల వరలక్ష్మమ్మ, కొనకనమిట్ల మండల అధ్యక్షుడు మోరా శంకర్‌రెడ్డి, జెడ్పీటీసీ అక్కిదాసరి ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు.
లక్ష్మీనరసింహస్వామి ఆలయ
రికార్డులన్నీ పొదిలి పరిధిలోనివే..
పృథులగిరి ఆలయాన్ని కొండపి
నియోజకవర్గంలో ఎలా చేరుస్తారు?
మంత్రి డోలా చర్యపై మార్కాపురం ఎమ్మెల్యే ఎందుకు ప్రతిఘటించలేదు
మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ ఇన్‌చార్జి అన్నా రాంబాబు


