చంద్రబాబు తీరుతో ఉచిత వైద్యం కష్టమే
ప్రజల అభిప్రాయాన్ని గౌరవించాలి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆపాలి మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు
తర్లుపాడు: చంద్రబాబు తీరుతో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వలన ప్రజలకు ఉచిత వైద్యం అందడం కష్టమని మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ వైఎస్‌ఆర్ సీపీ ఇన్‌చార్జ్ అన్నా రాంబాబు అన్నారు. ప్రజలకు నాణ్యమైన ఉచిత వైద్యం అందాలంటే ప్రభుత్వం ఆధ్వర్యంలోనే మెడికల్ కళాశాల నిర్మించాలని, అందుకు వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉద్యమానికి పార్టీలకతీతంగా మద్దతివ్వాలని విజ్ఞప్తి చేశారు. మండలంలోని మీర్జపేట, గొల్లపల్లి గ్రామాల్లో శుక్రవారం రాత్రి కోటి సంతకాల సేకరణలో భాగంగా రచ్చబండ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వెనుకబడిన పశ్చిమ ప్రకాశానికి అదనంగా మెడికల్ కళాశాల మంజూరు, వెలుగొండ ప్రాజెక్టును జాతికి అంకితం చేసి ఈ ప్రాంతంపై ఉన్న అభిమానాన్ని, ప్రేమను చూపారన్నారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే మెడికల్ కళాశాలలను తన అనుచరులకు కట్టబెట్టేందుకు పీపీపీ విధానం తీసుకొచ్చారని విమర్శించారు. ఈ చర్య దుర్మార్గమని అన్నారు. పార్టీలకు అతీతంగా సంతకాల సేకరణ జరుగుతోందని, ప్రజలు ప్రైవేటీకరణ వలన వచ్చే నష్టాన్ని అర్థం చేసుకుని దీన్ని అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. 66 ఏళ్లపాటు మెడికల్ కళాశాలలను ప్రైవేటు వారికి అప్పగిస్తే ఈ ప్రాంత ప్రజలు ఉచిత వైద్యం కోసం గతంలో లాగా ఒంగోలు, గుంటూరు, కర్నూలు ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుందని అన్నారు. మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేయడం వలన పేదలకు ఉచిత వైద్యం ఎలా అందుతుందని ఆయన ప్రశ్నించారు. భవిష్యత్తు తరాల కోసమే ఈ ఉద్యమం కొనసాగుతోందని, అందరూ స్వచ్ఛందంగా పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ భూలక్ష్మీ రామసుబ్బారెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు మురారి వెంకటేశ్వర్లు, కంది ప్రమీలారెడ్డి, గాయం శ్రీనివాసరెడ్డి, మీర్జపేట, గొల్లపల్లి గ్రామాలకు చెందిన సర్పంచ్‌లు రామిరెడ్డి, మీరయ్య, రమణయ్య, ఎంపీటీసీ రమేష్‌రెడ్డి, రంగారెడ్డి, మల్లారెడ్డి, వెలుగొండారెడ్డి, కాశయ్య, భాస్కర్‌రెడ్డి, శేషయ్య, వెంకటరెడ్డి, బాలిరెడ్డి, కృపాకర్, సుబ్బారెడ్డి, మండలంలోని అనుబంధ విభాగాల అధ్యక్షులు, సభ్యులు, పార్టీ కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు. అన్నా రాంబాబుకు మేళాతాళాలతో ఘనంగా స్వాగతం పలికారు.


