5న పేరెంట్స్, టీచర్స్ మీటింగ్
ఒంగోలు సబర్బన్: వచ్చేనెల 5వ తేదీన జరిగే మెగా పేరెంట్స్–టీచర్స్ మీటింగ్ కార్యక్రమాన్ని విజయవంతం చేయటంపై ఇప్పటి నుంచే దృష్టి సారించాలని కలెక్టర్ పీ.రాజాబాబు ఆదేశించారు. ఈ విషయంపై శుక్రవారం ప్రకాశం భవనం నుంచి అన్ని మండలాల ఎంపీడీవోలు, ఎంఈఓలు, క్లస్టర్ హెచ్‌ఎంలతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమ నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన మార్గదర్శకాలను అమలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తే సహించబోనని ఆయన స్పష్టం చేశారు. విద్యార్థుల తల్లిదండ్రులను, దాతలను, ప్రోటోకాల్ ప్రకారం అతిథులను ఆహ్వానించడంలో ఎలాంటి లోపం ఉండకూడదన్నారు. పాఠశాల ప్రాంగణం, పరిసరాలు ఆహ్లాదకరంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ చెప్పారు. పాఠశాలల్లో ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను విద్యార్థుల తల్లిదండ్రులకు వివరించటంతో పాటు వారి సూచనలు, సలహాలను కూడా తీసుకోవాలని అన్నారు. పదో తరగతి విద్యార్థులకు రాబోయే వంద రోజుల్లో అమలు చేయనున్న విద్యా ప్రణాళికను కూడా తల్లిదండ్రులకు వివరించి, ఉత్తమ ఫలితాలు రాబట్టడంలో వారు కూడా సహకరించేలా కోరాలని విద్యాధికారులకు కలెక్టర్ దిశా నిర్దేశం చేశారు. కేవలం చదువుపైనే కాకుండా విద్యార్థుల సమగ్ర అభివృద్ధి, పాఠశాలలో మౌలిక సదుపాయాల నిర్వహణపైనా ప్రధానోపాధ్యాయులు దృష్టి సారించాలని ఆయన చెప్పారు. సురక్షిత తాగునీరు విద్యార్థులకు అందించాలని పునరుద్ఘాటించారు. కుల, ఆదాయ ధ్రువీకరణ వంటి పత్రాల కోసం వాట్సప్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన సేవలపైనా విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ నిర్దేశించారు. సమావేశంలో డీఈఓ కిరణ్ కుమార్, జెడ్పీ సీఈవో చిరంజీవి, ఇతర అధికారులు పాల్గొన్నారు.


