కాడి కదలక!
మద్దతు లేక..
సాక్షి ప్రతినిధి, ఒంగోలు:
నిమ్మ, మిర్చి పంటలు పశ్చిమ ప్రకాశం జిల్లాలో ఎక్కువగా సాగుచేస్తారు. జిల్లా వ్యాప్తంగా 33,291 ఎకరాల్లో మిర్చి సాగు చేశారు. అందులో ఎక్కవ శాతం మార్కాపురం, యర్రగొండపాలెం, గిద్దలూరు, దర్శి నియోజకవర్గాల్లో ఎక్కువగా సాగవుతోంది. 2019 నుంచి 2024 మధ్య వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో మిర్చి రైతుల పంట పడింది. మార్కెట్లో క్వింటా ధర గరిష్టంగా రూ.27 వేలకు వెళ్లింది. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అనూహ్యంగా ధరలు పతనమయ్యాయి. గత సీజన్‌లో క్వింటా రూ.8 వేలు కూడా రాలేదు. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. చాలా మంది రైతులు అప్పులపాలయ్యారు. గత సీజన్‌లో సుమారు 65 వేల ఎకరాల్లో మిర్చి సాగు చేశారు. ప్రస్తుతం సాగు విస్తీర్ణం దాదాపు సగానికి పైగా పడిపోయింది. ప్రస్తుతం 33,291 ఎకరాల్లో మిర్చి సాగు చేస్తున్నారు. ఎకరాకు సుమారు రూ.1.25 లక్షల వరకూ ఖర్చుపెట్టారు. ఎకరాకు సుమారు 11 నుంచి 12 వేల మొక్కలు నాటారు. ఒక్కొక్క మొక్క రూపాయిన్నర ప్రకారం కొనుగోలు చేశారు. దీంతో మొక్కలకే సుమారు ఎకరాకు రూ.15 వేలు రాగా, నల్లతామర తెగులు సోకడంతో పురుగుమందులు వాడుతున్నారు. ఎకరాకు సుమారు రూ.20 వేల వరకూ ఖర్చుచేశారు. అధిక దిగుబడుల కోసం ఒక్కొక్క ఎకరాకు వివిధ రకాలకు చెందిన ఎరువులను 20 బస్తాల వరకూ వేశారు. సగటున రూ.30 వేల వరకూ ఎరువుల కోసం ఖర్చు చేశారు. ఇవి కాక సేద్యపు ఖర్చులు కూడా సుమారు రూ.20 వేల వరకూ వచ్చాయి. దీంతో ఎకరాకు 20 నుంచి క్వింటాళ్ల వరకూ దిగుబడులు వస్తేనే తమకు ఉపయోగమని రైతులు భావిస్తున్నారు. మోంథా తుఫాన్ దెబ్బకు పొలాల్లో నీరునిలబడి చాలా వరకూ పైర్లు దెబ్బతిన్నాయని, నల్లతామర తెగులు సోకడంతో ఎకరాకు 10 నుంచి 15 శాతం వరకూ దిగుబడులు తగ్గవచ్చని రైతులు ఆందోళన చెందుతున్నారు. మార్కాపురంలో మిర్చి కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేస్తే రైతులకు కొంత మేరుకు ప్రయాణపు ఖర్చులు తగ్గుతాయని రైతు సంఘాల నేతలు అంటున్నారు.
కాడి కదలక!
కాడి కదలక!


