మెక్కేశారు.. కక్కిస్తారా..? | - | Sakshi
Sakshi News home page

మెక్కేశారు.. కక్కిస్తారా..?

Nov 27 2025 5:56 AM | Updated on Nov 27 2025 5:56 AM

మెక్కేశారు.. కక్కిస్తారా..?

మెక్కేశారు.. కక్కిస్తారా..?

రూ.10 వేలు రుణం కావాలంటేనే బ్యాంకులు కాళ్లరిగేలా తిప్పుకుంటాయి. కానీ పట్టణ పేదరిక నిర్మూలనా సంస్థ(మెప్మా)లో మాత్రం మనుషులు లేకుండానే రుణాల పేరుతో కోట్ల రూపాయలు కొల్లగొట్టేశారు. ఒకరిద్దరు చేసింది కాదు. ప్రజాప్రతినిధులు,

అధికారులు, సిబ్బంది అందరి పాత్ర ఉంది. తిలా పాపం..తలా పిడికెడు..రుణ అక్రమాలు బయటపడినా కమిటీలు వేసి ఉన్నతాధికారులు కాలయాపన చేశారే తప్ప ఒక్కరినీ పట్టుకోలేకపోయారు. ఫలితంగా ప్రజల సొమ్ము కోట్లాది రూపాయలు అక్రమార్కుల చేతుల్లోకి వెళ్లిపోయాయి.

ఒంగోలు సబర్బన్‌:

ట్టణ పేదరిక నిర్మూలనా సంస్థ(మెప్మా)లో దొంగలు పడ్డారు.బోగస్‌ స్వయం సహాయక మహిళా (డ్వాక్రా) గ్రూపుల మాటున ప్రజల సొమ్మును బొక్కేశారు.రోజుకో కొత్త బాగోతం బయటపడుతుండటంతో డ్వాక్రా సంఘాల మహిళలు ఆందోళన చెందుతున్నారు. కోట్ల రూపాయల స్కాం బాగోతం వెనుక ఉన్నది ఎవరన్నది ఇంకా మిస్టరీగానే మారింది.

మెప్మాలో అక్రమాలు సర్వసాధారణమే

మెప్మాలో అక్రమాలు అనేవి సర్వసాధారణంగా మారిపోయింది. ఇక్కడ పనిచేసే అధికారులు, సిబ్బందే దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారు. గతంలో టెక్నికల్‌ ఎక్స్‌పర్ట్‌గా ఉన్న కల్పన తానే సీఎంఎంనని బోగస్‌ గ్రూపులను ప్రోత్సహించి బ్యాంకుల్లో సంతకాలు పెట్టి రుణాలు ఇప్పించి రూ.1.40 కోట్లలో అక్రమాలకు పాల్పడింది. దీంతో ఆమెను పీడీ శ్రీహరి సస్పెండ్‌ చేశారు. తరువాత టౌన్‌ లెవల్‌ ఫెడరేషన్‌ ఆర్‌పీ జి.ఉమామహేశ్వరి సభ్యులకు తెలియకుండా బోగస్‌ గ్రూపులు ఏర్పాటు చేసి రూ.లక్షల్లో ఆరగించింది. మరో ఆర్‌పీ డి.పార్వతి రూ.40 లక్షలు కాజేసింది. బ్యాంకు వాళ్లు ఇచ్చిన నివేదిక ప్రకారం ఆమైపె చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం కేశవస్వామిపేట ఆర్‌పీ కొల్లాబత్తిన దివ్య శాంతి 14 గ్రూపుల్లో సభ్యులకు తెలియకుండా బ్యాంకుల్లో రుణాలు తీసుకున్నట్లు సభ్యులు స్వయంగా పీడీ శ్రీహరికి ఫిర్యాదు కూడా చేశారు. మెప్మా కార్యాలయములో డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా విధులు నిర్వహిస్తున్న కుర్రా సునీల్‌ ప్రభుత్వ ఖాతాకు సంబంధించిన చెక్కులను టాంపరింగ్‌ చేసి మెప్మా ప్రభుత్వ ఖాతాలో ఉన్న సొమ్మును అక్రమంగా రూ.4,64,500లను డ్రా చేశాడు. బ్యాంక్‌ అధికారులు ఇచ్చిన నివేదిక ఆధారంగా విషయం బయటకు వచ్చింది. అతని వద్ద నుంచి ల్యాప్‌టాప్‌తో పాటు డబ్బును రికవరీ చేశారు. అయితే కుర్రా సునీల్‌ వెనుక నుంచి నడిపిస్తుంది ఎవరనేది అధికారులు కనిపెట్టలేదు. అక్రమంగా నగదు డ్రా చేసినా ఇంత వరకు అతనిపై క్రిమినల్‌ చర్యలు తీసుకోలేదు. నగరంలోని కేశవస్వామిపేటలో 14 బోగస్‌ గ్రూపులు ఉన్నట్లు గ్రూపు సభ్యులు అధికారులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. వాస్తవానికి అవి 14 కాదు 36 అని అధికారులు గుర్తించారు. స్థానికంగా ఉంటున్న ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన గ్రూపు మహిళలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ నిర్వహించగా తొలుత 14 బోగస్‌ గ్రూపులు వెలుగుచూశాయి. మరింత లోతుగా విచారణ నిర్వహించగా 36 గ్రూపులు గుర్తించారు.

కమిటీల పేరుతో కాలయాపన

మెప్మాలో జరుగుతున్న ఆర్థిక అక్రమాలపై నిగ్గు తేల్చాల్సిన అధికారులు విచారణ పేరుతో కమిటీలు వేస్తూ కాలయాపన చేస్తున్నారు. అక్రమాలపై ఇప్పటికే ఐదారు కమిటీలు వేసినా ఒక్క నివేదిక కూడా బయటకు రాలేదు. నివేదికలు ఇవ్వనప్పుడు కమిటీలు వేయడం ఎందుకని బాధిత మహిళలు ప్రశ్నిస్తున్నారు. గతంలో దినేష్‌కుమార్‌ కలెక్టర్‌గా ఉన్నప్పుడు కమిటీ వేశారు. కమిటీ సభ్యులు నివేదికను కలెక్టర్‌కు ఇచ్చినా బయటకు రాలేదు, ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఆ తరువాత వచ్చిన కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా కూడా మరో కమిటీ వేశారు. ఆ కమిటీ నివేదిక ఏమైందో తెలియదు. ఈ ఏడాది ఏప్రిల్‌లో నూతనంగా బాధ్యతలు తీసుకున్న పీడీ పి.శ్రీహరి ఏడుగురు సభ్యులతో కూడిన కమిటీని వేశారు. కేశవస్వామిపేట డ్వాక్రా మహిళలు ఇచ్చిన ఫిర్యాదుపై ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని వేశారు. కానీ ఈ కమిటీల్లో ఒక్క నివేదిక బయటకు రాలేదు. ఒక్కరిపై చర్యలు తీసుకుంది లేదు. ప్రస్తుతం కలెక్టర్‌ పి.రాజాబాబు, జాయింట్‌ కలెక్టర్‌ గోపాలకృష్ణ ఆధ్వర్యంలో నూతనంగా మరో కమిటీని వేశారు.

మెప్మాలో బోగస్‌ గ్రూపుల పేరుతో బ్యాంకుల్లో రూ.కోట్లలో రుణాలు

కమిటీలు వేస్తూ కాలయాపన

ప్రజల సొమ్ము కోట్లు నొక్కేసిన ఘరానా దొంగలు

నకిలీలతో మెప్మా అధికారులు, సిబ్బంది కుమ్మక్కు

కమిటీలు సరే..చర్యలు ఎక్కడ..?

ఫిర్యాదులు చేస్తున్నా..చర్యలేవి..

మెప్మాలో రుణాల అక్రమాలపై గ్రూపు సభ్యులు, బాధితులు పోలీస్‌స్టేషన్‌లలో ఫిర్యాదులు చేశారు. కానీ ఆ ఫిర్యాదులకు సంబంధించి కేసులు ఏమయ్యాయో ఎవరికీ అంతుబట్టని పరిస్థితి. అధికార పార్టీ నాయకుల అండదండలతో ఆ కేసులను అటకెక్కించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇన్ని కోట్ల రూపాయలు స్వాహా చేసినా కనీసం ఒక్కరినీ కూడా బాధ్యులను చేసి చర్యలు తీసుకోకపోవడంతో ఆంతర్యం ఏంటని బాధిత మహిళలు ప్రశ్నిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement