అడ్డగోలు నిర్ణయాలు సరికాదు
కనిగిరిరూరల్: అధికారంలో ఉన్నారని అడ్డగోలుగా, ఇష్టానుసారంగా జిల్లాల విభజన ఏర్పాటు చేయడం సరైంది కాదని వైఎస్సార్‌సీపీ విశాఖపట్నం పార్లమెంట్ పరిశీలకుడు, కనిగిరి మాజీ ఎమ్మెల్యే కదిరి బాబురావు అన్నారు. బుధవారం ఆయన కనిగిరిలో విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. మార్కాపురం కొత్త జిల్లా ఏర్పాటులో కనిగిరి, మార్కాపురంలోని రెండు రెవెన్యూ డివిజనల్‌లోని నాలుగు నియోజకవర్గాలు (కనిగిరి, మార్కాపురం, వై పాలెం, గిద్దలూరు) వెనుకబడిన ప్రాంతాలేనన్నారు. పారిశ్రామిక అభివృద్ధి, ఉపాధి అవకాశాలు తక్కువగా ఉండి సాగుకు, వ్యాపారాలకు తగు అవకాశాలు లేని మండలాలన్నింటినీ కలిపి జిల్లా చేయడం ఎంతవరకు సమజసమని ప్రశ్నించారు. మార్కాపురం జిల్లాలో కందుకూరు లేదా దర్శి నియోజకవర్గాలను కలిపితేనే కొంతమేర జిల్లా ఏర్పాటులో న్యాయం జరుగుతుందన్నారు. కేవలం రాజకీయ స్వార్ధ ప్రయోజనాలకు అనుగుణంగా అధికార పార్టీ నేతలు కొత్త జిల్లాల ఏర్పాటు జరుగుతున్నాయని విమర్శించారు. చంద్రబాబు ప్రభుత్వం ఏకపక్ష వైఖరిగా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు.
పశ్చిమ ప్రాంతంపై చంద్రబాబుకు
చిన్నచూపే..
వెనుకబడిన పశ్చిమ ప్రాంతాలపై చంద్రబాబుకు ఎప్పుడూ చిన్న చూపేనన్నారు. పశ్చిమప్రాంత వాసులను మరింత వెనుకబాటుకు గురిచేసేలా చంద్రబాబు ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపించారు. కనిగిరి నియోజకవర్గంలో ఎటువంటి పరిశ్రమలు లేవని, తాగు, సాగు జలాలు, శాశ్వత నీటి పథకాలు లేవని, వెలిగొండ జలాలు మాటల్లోనే ఉందని, నిమ్జ్ నత్తతో పోటీ పడుతుందన్నారు. చంద్రబాబు సర్కార్ తెరపైకి తెచ్చిన పీపీపీ విధానంతో మార్కాపురంలోని వైద్య కళాశాల, జీజీహెచ్ హాస్పిటల్స్‌లో పేద వర్గాలకు వైద్య విద్య, వైద్యం రెండు అందని ద్రాక్షలా మారుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రవేటీకరణ నిర్ణయంతో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందని ఘాటుగా విమర్శించారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్ సీపీ ఉధృత పోరాటం సాగిస్తోందన్నారు. పీడీసీసీబీ మాజీ చైర్మన్, వైఎస్సార్ సీపీ రైతు విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వైఎం ప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ కొత్త జిల్లా ఏర్పాటులో చంద్రబాబు సర్కార్ పాదర్శకత పాటించాలన్నారు. దర్శి నియోజకవర్గాన్ని కొత్త జిల్లా మార్కాపురంలో ఉంచాలన్నారు. మార్కాపురం కొత్త జిల్లాను నల్లమల జిల్లాగా నామకరణం చేయాలని అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు.
వెనుకబడిన నియోజకవర్గాలతో జిల్లా చేయడం సమంజసం కాదు
పశ్చిమ ప్రాంతంపై చంద్రబాబుకు ఎప్పుడూ చిన్నచూపే
మాజీ ఎమ్మెల్యే కదిరి బాబురావు ధ్వజం


