భారతీయులంతా గర్వపడే రోజు
ఒంగోలు సబర్బన్: భారతీయులంతా భారత రాజ్యాంగ దినోత్సవం సందర్బంగా గర్వపడే రోజని కలెక్టర్ పి.రాజాబాబు అన్నారు. భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం నగరంలోని హెచ్‌సీఎం సెంటర్ వద్ద ఉన్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దేశ పౌరులకు న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాలను అందిస్తూ రాజ్యాంగాన్ని ఆమోదించి నేటికి 75 ఏళ్లు పూర్తయిందన్నారు. ప్రపంచంలోనే ఉత్తమ రాజ్యాంగంగా కొనియాడుతున్న భారత రాజ్యాంగాన్ని అందరూ స్మరించుకుంటున్నారన్నారు. రాజ్యాంగం గొప్పదనాన్ని ప్రతి ఒక్కరికీ తెలియాలన్న ఉద్దేశంతో నవంబరు 26న భారత రాజ్యాంగ దినోత్సవాన్ని ఏటా ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరూ అంబేడ్కర్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. అనంతరం విద్యార్థులతో కలిసి కలెక్టర్ ప్రతిజ్ఞ చేశారు. జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దనరావు, నగర మేయర్ గంగాడ సుజాత, ఒడా చైర్మన్ షేక్ రియాజ్, ఏపీ మాల కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ విజయ్‌కుమార్, డీఆర్‌ఓ చినఓబులేసు తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎస్సీ కార్పొరేషన్ ఈడీ అర్జున్‌నాయక్, సోషల్ వెల్ఫేర్ డీడీ లక్ష్మానాయక్, నగర కమిషనర్ వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే కసుకుర్తి ఆదెన్న, దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు.
కలెక్టర్ రాజాబాబు
ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం


