వందేభారత్ రైలు తీసుకొస్తే దేశ భక్తులు కాలేరు
● రాజకీయ విశ్లేషకుడు పరకాల ప్రభాకర్
ఒంగోలు టౌన్: వందేభారత్ రైలు, నాలుగు ఆకర్షణీయమైన పథకాలు తీసుకొచ్చినంత మాత్రానే దేశ భక్తులు కాలేరని ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు పరకాల ప్రభాకర్ ఎద్దేవా చేశారు. దేశం కోసం ఎలాంటి పోరాటాలు, త్యాగాలు చేయకుండా దేశభక్తులమని చెప్పుకుంటే సరిపోదని వ్యాఖ్యానించారు. ప్రకాశం జిల్లా అభివృద్ధి వేదిక ఆధ్వర్యంలో బుధవారం స్థానిక ఆచార్య రంగా భవన్‌లో రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని సభ నిర్వహించారు. సభకు ముఖ్య అతిథిగా హాజరైన పరకాల ప్రభాకర్ మాట్లాడుతూ స్వాతంత్రోద్యమం, భారత రాజ్యాంగంపై ఏమాత్రం అవగాహన లేని వారు నేడు పాలకులుగా కొనసాగడం దౌర్భాగ్యమని చెప్పారు. కేంద్ర ఎన్నికల సంఘాన్ని గుప్పిట్లో ఉంచుకొని ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తోందని ఆరోపించారు. 2024లో ఎన్నికలు పూర్తయిన వారం రోజుల తరువాత ఓటింగ్ శాతం చెప్పడం వెనక అసలు రహస్యమేంటని ప్రశ్నించారు. ఎస్‌ఐఆర్ పేరుతో 65 లక్షల ఓట్లను తొలగించినా ఎవరు ప్రశ్నించకూడదని కేంద్ర ప్రభుత్వం చెబుతుందని, చివరకు సుప్రీంకోర్టు ఆదేశాలతో తొలగించిన వారి జాబితా కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిందని గుర్తు చేశారు. మోదీ నాయకత్వంలోని బిజేపీ తాము 99 శాతం ఓట్లతో గెలిచామని ప్రకటించే రోజులు ఎంతో దూరంలో లేవన్నారు. దేశానికి రైతే వెన్నముక అని చెబుతూ రైతన్నల నడ్డి విరిచే మూడు నల్ల చట్టాలను ఎటువంటి చర్చలు లేకుండా ఆమెదించడం ఎంత వరకు సబబని ప్రశ్నించారు. రాజ్యాంగ పరిరక్షణ ద్వారానే దేశం మనుగడ సాధ్యమని, బలి ఇచ్చే ముందు జంతువును పూజించిన విధంగా మోదీ ప్రభుత్వం రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహిస్తుందని విమర్శించారు. రాజ్యాంగ పరిరక్షణ కోసం యువతరం రోడ్ల మీదకు రావాలని పిలుపునిచ్చారు. విశ్రాంత జిల్లా జడ్జి వి.నాగేశ్వరరావు మాట్లాడుతూ. చరిత్రను వక్రమార్గం పట్టించేందుకు జరుగుతున్న ప్రయత్నాలను బలంగా తిప్పికొట్టాలని కోరారు. ప్రకాశం జిల్లా అభివృద్ధి వేదిక జిల్లా అధ్యక్షుడు చుండూరి రంగారావు అధ్యక్షత వహించిన కార్యక్రమంలో రిటైర్డ్ జడ్జి నలదల బసవయ్య, సీపీఐ జిల్లా కార్యదర్శి ఎంఎల్ నారాయణ, సీపీఎం జిల్లా కార్యదర్శి ఎస్‌కే మాబు, రైతు కూలి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిట్టిపాటి వెంకటేశ్వర్లు, ఓపీడీఆర్ రాష్ట్ర అధ్యక్షుడు చావలి సుధాకర్, పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎల్.రాజశేఖర్, రెడ్‌స్టార్ జిల్లా కార్యదర్శి బీమవరపు సుబ్బారావు పాల్గొన్నారు.


