సోలార్ విద్యుత్‌పై అవగాహన పెంచాలి
● కలెక్టర్ రాజాబాబు
ఒంగోలు సబర్బన్: సోలార్ విద్యుత్ వినియోగం వల్ల కలిగే ఆర్థిక ప్రయోజనాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్ పి.రాజాబాబు అధికారులను ఆదేశించారు. ప్రధానమంత్రి సూర్యఘర్ పథకం జిల్లాలో అమలవుతున్న తీరుపై బుధవారం ఆయన ప్రకాశం భవనంలోని తన ఛాంబర్లో సంబంధిత అధికారులతో సమీక్షించారు. జిల్లాలో ఈ పథకం అమలవుతున్న తీరు, పురోగతిని ఏపీసీపీడీసీఎల్ ఎస్‌ఈ కట్టా వెంకటేశ్వర్లు కలెక్టర్‌కు వివరించారు. నెలవారీ విద్యుత్ వినియోగం ఎక్కువగా ఉంటున్న గృహాల యజమానులు సోలార్ విధానంలోకి మారేందుకు ఆసక్తి చూపుతున్నట్లు చెప్పారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ 75 నుంచి 225 యూనిట్ల నెలవారీ వినియోగం ఉన్న గృహాల యజమానులు కూడా ఈ విధానంలోకి మారేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఈ దిశగా వారికి అవగాహన కల్పించాలన్నారు. ఇంటిపైన సోలార్ సిస్టం ఏర్పాటు చేసుకోవడానికి ప్రభుత్వం ఇస్తున్న రాయితీ, మిగులు విద్యుత్‌ను ప్రభుత్వానికి విక్రయించడం ద్వారా కలిగే ఆర్థిక ప్రయోజనాలను వారికి వివరించాలన్నారు. సొంత గృహాలు కలిగిన స్వయం సహాయక సంఘాల మహిళలపై ప్రత్యేక దృష్టి సారించి సోలార్ విధానంలోకి వారు మారేలా చూడాలన్నారు. సోలార్ పరికరాలను సరఫరా చేసే స్థానిక ఏజెన్సీలను గుర్తించాలన్నారు. ఏవైనా సాంకేతిక సమస్యలు వస్తే తక్షణమే సరిచేసేలా వీరికి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ చిరంజీవి, డీఆర్డీఏ పీడీ నారాయణ, ఏపీసీపీడీసీఎల్ ఈఈలు, నెడ్ క్యాప్ పీడీ వంశీ, లీడ్ బ్యాంకు అధికారులు, సోలార్ యూనిట్ల ఏజెన్సీల ప్రతినిధులు పాల్గొన్నారు.


