వేలం ముగుస్తున్నా.. ఆగని అగచాట్లు!
పొదిలి/కొండపి/టంగుటూరు: పొగాకు వేలం చివరి దశకు చేరినా రైతులకు అగచాట్లు తప్పడం లేదు. పొదిలి వేలం కేంద్రం పరిధిలో వందల సంఖ్యలో లోగ్రేడ్ పొగాకు బేళ్లు విక్రయించుకునేందుకు రైతులకు అనుమతి ఇచ్చిన అధికారులు ఆ దిశగా ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు. మంగళవారం రాత్రి పొదిలి వేలం కేంద్రం నిండిపోయి, ట్రాక్టర్లు మొత్తం రోడ్డుపైనే ఉన్నాయి. రైతులు బేళ్లపైనే రాత్రి నిద్రకు ఉపక్రమించారు. వందల సంఖ్యలో బేళ్లు తెస్తే.. పదుల సంఖ్యలో కూడా కొనుగోలు చేయడం లేదని రైతులు బహిరంగంగా ఆరోపిస్తున్నారు. బేళ్లు మొత్తం కొనుగోలు చేసి రైతులకు కనీస మద్దతు ధరను వచ్చేలా చూడాలని అధికారులను వేడుకుంటున్నారు.
బేళ్ల తిరస్కరణలో రికార్డులు బ్రేక్
కొండపి పొగాకు వేలం కేంద్రంలో మంగళవారం 463 బేళ్లు తిరస్కరణకు గురయ్యాయి. ధర్మవరం, కొండపి, చవటపాలెం, దాదానాయుడుపాలెం గ్రామాల రైతులు 1442 బేళ్లను వేలానికి తీసుకురాగా 979 బేళ్లను మాత్రమే వ్యాపారులు కొనుగోలు చేశారు. పొగాకు గరిష్ట ధర కేజీ రూ.310, కనిష్ట ధర రూ.50, సరాసరి ధర రూ.115.52గా నమోదైంది. టంగుటూరు వేలం కేంద్రంలోనూ బేళ్ల తిరస్కరణ పరంపర కొనసాగింది. మంగళవారం నిర్వహించిన వేలంలో 487 పొగాకు బేళ్లు తిరస్కరణకు గురికావడంతో రైతులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కమ్మవారిపాలెం, కట్టుబడిపాలెం, పొందూరు, పంగులూరివారిపాలెం, చింతలపాలెం, దావగూడూరు గ్రామాల రైతులు 1194 బేళ్లు వేలానికి ఉంచగా 707 బేళ్లనే వ్యాపారులు కొనుగోలు చేశారు. గరిష్ట ధర కేజీ రూ.310, కనిష్ట ధర రూ.50, సరాసరి రూ.110.95 పలికింది. వేలంలో 46 మంది వ్యాపారులు పాల్గొన్న ప్పటికీ కొందరు సిండికేట్‌గా మారి ధరలు తెగ్గోశారని రైతులు ఆరోపించారు. ఇప్పటి వరకు రోజూ సుమారు 100 బేళ్ల చొప్పున తిరస్కరణకు గురికాగా ప్రస్తుతం ఆ సంఖ్య 400కు మించడంతో రైతులు అయోమయంలో పడిపోయారు. ఓ వైపు బేళ్ల తిరస్కరణ, మరో వైపు లోగ్రేడ్ పొగాకు ధర దారుణ పతనాన్ని చూసి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పొదిలి వేలం కేంద్రంలో మందకొడిగా పొగాకు బేళ్ల కొనుగోలు
మంగళవారం ఒక్కరోజే కొండపిలో 463, టంగుటూరులో 487 బేళ్ల తిరస్కరణ
అధికారుల తీరు, వ్యాపారుల సిండికేట్‌పై రగిలిపోతున్న రైతులు
వేలం ముగుస్తున్నా.. ఆగని అగచాట్లు!


