ప్రమాదవశాత్తు జారిపడి యువకుడు మృతి
టంగుటూరు: పొగాకు కంపెనీలో వెల్డింగ్ పనిచేస్తూ ప్రమాదవశాత్తు జారిపడి యువకుడు మృతి చెందాడు. ఈ సంఘటన టంగుటూరు టోల్ ప్లాజా జాతీయ రహదారి సమీపంలో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం ఆరిమణిపేట గ్రామానికి జి.మేఘనాథ్(27) చింతపర్తి రాజ్‌కుమార్ ఆధ్వర్యంలో బీవీఎల్ పొగాకు కంపెనీలో వెల్డింగ్ పనులు చేస్తూ ఉంటాడు. మంగళవారం వెల్డింగ్ పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు 20 అడుగులపై నుంచి జారిపడ్డాడు, దీంతో స్పృహ కోల్పోవడంతో కారులో చికిత్స నిమిత్తం ఒంగోలు రిమ్స్‌కు తరలించగా చికిత్స పొందుతూ మేఘనాథ్ మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. ప్రమాద సంఘటనపై ఫిర్యాదు రాలేదని ఎస్సై నాగమల్లీశ్వరరావు తెలిపారు.
మర్రిపూడి: పంటల సాగులో చేసిన అప్పులు తీర్చేందుకు జార్ఖండ్‌లోని బొగ్గు కంపెనీలో పనిచేస్తూ భార్య, బిడ్డలను చూసేందుకు స్వగ్రామానికి వస్తున్న వ్యక్తి గుండెపోటుతో రైల్వేస్టేషన్‌లోనే కుప్పకూలాడు. వివరాల్లోకి వెళితే.. జరుగుమల్లి మండలం తూమాడు గ్రామానికి చెందిన వాసా సుందరరామిరెడ్డి, ఆదిలక్ష్మమ్మ దంపతుల రెండో కుమారుడు బీటెక్ వరకు చదువుకున్నారు. శేషారెడ్డి(35)కి మర్రిపూడికి చెందిన స్వాతితో 6 ఏళ్ల క్రితం వివాహమైంది. రెండేళ్లుగా వ్యవసాయం కలిసి రాకపోవడంతో అప్పులపాలయ్యాడు. ఈ క్రమంలో కుటుంబాన్ని ఆర్థికభారం నుంచి బయటపడేసేందుకు భార్య బిడ్డలకు నచ్చజెప్పి జార్ఖండ్ రాష్ట్రంలోని ఓ ప్రైవేట్ బొగ్గుకంపెనీలో ఉద్యోగంలో చేరాడు. కొంత కాలం నుంచి అక్కడే ఉంటూ తన సంపాదనతో కొంత మొత్తాన్ని కుటుంబ అప్పులు, ఆకలి తీర్చాడు. ఈ క్రమంలో భార్య, పిల్లలను చూసేందుకు సోమవారం సాయంత్రం జార్ఖండ్ రాజధాని రాంచీ నుంచి బయలుదేరాడు. రైలు ఎక్కే సమయంలో భార్యతో మాట్లాడాడు. అయితే రైలు ఎక్కే క్రమంలో రైల్వస్టేషన్‌లోనే ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. తోటి ప్రయాణికులు రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అనంతరం ఫోన్‌లో ఆఖరి సారి మాట్లాడిన నంబర్‌కు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. అప్పటి వరకు తమతో మాట్లాడిన భర్త మృతి చెందాడని తెలుసుకున్న ఆ ఇల్లాని వేదనకు అంతే లేకుండా పోయింది. నాన్న వస్తాడనే ఎదురుచూసే ఆ చిన్నారుల కళ్లు కన్నీళ్లతో నిండిపోయాయి. తన కన్నబిడ్డ కానరాని లోకానికి వెళ్లిపోయాడని ఆ తల్లిదండ్రులు విలపించిన తీరు చూపులను కంట తడిపెట్టించింది. మృతదేహాన్ని బుధవారం సాయంత్రం నెల్లూరు రైల్వేస్టేషన్‌లో స్వాధీనం చేసుకోవాలని జార్ఖండ్ రైల్వేపోలీసులు కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు.
ప్రమాదవశాత్తు జారిపడి యువకుడు మృతి


