యువకుడి హత్య కేసులో నిందితుడి అరెస్టు
● హత్య కేసు వివరాలు వెల్లడించిన యర్రగొండపాలెం సీఐ
పెద్దదోర్నాల: పెద్దమంతనాల గిరిజన గూడెంలో గిరిజన యువకుడు అర్తి అంకన్న(23) హత్య కేసులో నిందితుడిని పోలీసులు వలపన్ని మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. అనంతరం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలను సీఐ అజయ్‌కుమార్, ఎస్సై మహేష్ వెల్లడించారు. బాలింత అయిన తన భార్యకు ఎందుకు మద్యం తాపించావని ప్రశ్నించినందుకే గిరిజన యువకుడు ఆర్తి అంకన్నను ఆదే గూడేనికి చెందిన ఆర్తి నాగన్న కత్తితో హతమార్చినట్లు తెలిపారు. వివరాల్లోకి వెళితే..పెద్దమంతనాల గూడేనికి చెందిన ఆర్తి అంకన్న, దేవమ్మలు భార్యా భర్తలు, ఆర్తి అంకన్న అడవి కర్రలు అమ్ముకుంటూ జీవనం కొనసాగించేవాడు. ఈ నేపథ్యంలో ఈ నెల 20న అర్తి అంకన్న పెద్దారవీడు మండలం కుంట వద్ద కర్రలు అమ్ముకుని ఇంటికి వచ్చే సరికి బాలింత అయిన భార్య దేవమ్మ మద్యం తాగి ఉంది. దీంతో భార్యను ఎందుకు మద్యం తాగావని ప్రశ్నించగా, గూడేనికి చెందిన ఆర్తి నాగన్న తనకు మద్యం తాపించినట్లు తెలిపింది. దీంతో ఆర్తి అంకన్న, అతని కుటుంబసభ్యులు నాగన్న దగ్గరకు వెళ్లి బాలింత అయిన తన భార్యకు ఎందుకు తాపించావని ప్రశ్నించాడు. దీంతో అంకన్న, నాగన్నల మధ్య కొద్దిపాటి ఘర్షణ జరిగింది. ఘర్షణలో నాగన్న తన నడుముకున్న చిన్నపాటి చాకుతో గుండైపె పొడవటంతో అంకన్న సంఘటనా స్థలంలోనే మృత్యువాత పడ్డాడు. మృతుడి తండ్రి ఇచ్చిన ఫిఽర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. ఈ క్రమంలో ఆర్తి నాగన్న బోడేనాయక్‌తాండా వద్ద ఉన్నట్లు సమాచారం అందటంతో అతన్ని అదుపులోకి తీసుకున్నట్లు సీఐ అజయ్‌కుమార్ తెలిపారు. నిందితుడు నాగన్నను మార్కాపురం కోర్టులో హాజరుపర్చనున్నట్లు పేర్కొన్నారు.


