దూషించాడని టీడీపీ ఎంపీటీసీ నిరసన
పొన్నలూరు: తనన గృహ నిర్మాణశాఖ వర్క్ ఇన్‌స్పెక్టర్ దూషించాడని టీడీపీ ఎంపీటీసీ..గృహ నిర్మాణశాఖ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశాడు. వివరాల్లోకి వెళితే.. పొన్నలూరు మండల గృహ నిర్మాణశాఖ వర్క్ ఇన్‌స్పెక్టర్ సుధీర్ విధుల్లో భాగంగా కె.అగ్రహరం గ్రామానికి మంగళవారం వెళ్లాడు. అయితే స్థానిక ఎంపీటీసీ వంగపాటి రామాంజనేయులు తనకు సమాచారం ఇవ్వకుండా గ్రామంలోని లబ్ధిదారులతో ఎలా మాట్లాడతావని ప్రశ్నించాడు. దీంతో సుధీర్ నీకు చెప్పాల్సిన అవసరం లేదురా..అంటూ అగౌరవంగా మాట్లాడాడని రామాంజనేయులు వాపోయాడు. అలాగే నీ దిక్కున చోట చెప్పుకో, నీకు చేతనైంది చేసుకో అంటూ దుర్భాషలాడాడని తెలిపాడు. బీసీ కులానికి చెందిన ఎంపీటీసీని కాబట్టే గ్రామంలో చేపట్టే కార్యక్రమాల్లో హౌసింగ్ అధికారులు తనకు సమాచారం ఇవ్వకుండా చులకనగా చూస్తున్నారని రామాంజనేయులు బాధపడ్డాడు. దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానని, సుధీర్‌పై చర్యలు తీసుకోవాలని కార్యాలయం ముందు బైఠాయించాడు. రామాంజనేయులుకు సంఘీభావంగా సర్పంచ్ చిన్న మస్తాన్, మాజీ కోఆప్షన్ సభ్యుడు ఖాదర్‌వలీ నిరసన తెలిపారు.


