లైంగిక దాడులపై విస్తృత చర్చ జరగాలి
● సీనియర్ సివిల్ న్యాయమూర్తి షేక్ ఇబ్రహీం
ఒంగోలు సిటీ: మహిళలపై జరుగుతున్న లైంగిక దాడుల గురించి సమాజంలో విస్తృతంగా చర్చ జరగాలని, తద్వారా ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించి హింసను అరికట్టాలని ఇది ప్రతి ఒక్కరి బాధ్యత అని జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ న్యాయమూర్తి షేక్ ఇబ్రహీం అన్నారు. పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలోని మహిళ అభ్యుదయ సమితి సహకారంతో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మహిళలపై జరుగుతున్న హింస అనేది రోజుకో రూపం మార్చుకొని మానసికంగానే హింసకు గురిచేస్తున్నారన్నారు. వీటిని ప్రాథమిక దశలోనే గుర్తించి నిర్మూలించాలన్నారు. కార్యక్రమంలో స్వధార్ హోమ్ నిర్వాహకులు తేళ్ల అరుణ, శక్తి మిషన్ డీఎంసీ అవాంజెలిన్, వడ్డెర కార్పొరేషన్ సభ్యులు టి.రమాదేవి, సఖి వన్ స్టాప్ సెంటర్ కో ఆర్డినేటర్ ఎన్ జ్యోతి సుప్రియ, ఐసీడీఎస్ సిబ్బంది పాల్గొన్నారు.


