నిబండనలు మీరి!
కాసుల కొండల్లో..
ఇటీవల రాళ్లు పడిపోయి ఆరుగురు కూలీలు మృతిచెందిన బల్లికురవ సత్యకృష్ణ గ్రానైట్ క్వారీ (ఫైల్)
సాక్షి ప్రతినిధి, ఒంగోలు:
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 180 వరకు క్వారీలు ఉన్నాయి. ఈ క్వారీలన్నీ కేవలం 45 గ్రానైట్ వ్యాపార కంపెనీల చేతుల్లో ఉండడం గమనార్హం. ఒక్కో కంపెనీ 5 నుంచి 10 క్వారీలను చేతిలో పెట్టుకొని కోట్లాది రూపాయల వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకున్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని బల్లికుర ప్రాంతంలో దాదాపు 60 వరకు క్వారీలు ఉన్నాయి. చీమకుర్తి మండలం ఆర్‌ఎల్‌పురం పరిసరాల్లో దాదాపుగా 3 వేల హెక్టార్లలో ప్రపంచ ప్రసిద్ధి చెందిన గ్రానైట్ గనులున్నాయి. ఈ క్వారీల్లో ఒడిశా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, బీహార్ తదితర రాష్ట్రాలకు చెందిన కూలీలు సుమారు 15 వేల మందికి పైగా పనులు చేస్తున్నారు. వీరికి తోడు ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన మరో 5 వేల మందికి పైగా కూలీలు, కార్మికులు పనిచేస్తున్నారు. పొట్టచేత పట్టుకొని వేల కిలోమీటర్ల దూరం నుంచి వచ్చిన కార్మికులు దినదినగండంగా గడుపుతున్నారు.
ప్రమాదపు అంచులో 8 క్వారీలు...
చీమకుర్తి, బల్లికురవ పరిసరాల్లో పలు క్వారీలు ప్రమాదంలో ఉన్నట్టు తెలుస్తోంది. చీమకుర్తి మండలంలోని ఆర్‌ఎల్ పురంలో ఉన్న ఒక గ్రానైట్ క్వారీలో మూడు ప్రదేశాల్లో ఒకటి ఇప్పటికే పడిపోయినట్లు తెలుస్తోంది. మరో రెండు ప్రదేశాల్లో ప్రమాదం జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇక్కడే ఉన్న మరొక గ్రానైట్‌లో కూడా ఒక ప్రదేశం ప్రమాదంలో ఉన్నట్లు సమాచారం. నిబంధనలకు వ్యతిరేకంగా ఇక్కడ క్వారీలోనే కార్యాలయాన్ని ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఇది మరింత ప్రమాదమని కార్మిక నాయకులు హెచ్చరిస్తున్నా యాజమాన్యం పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇక్కడే ఉన్న ఇంకొక క్వారీలో ఒక ప్రదేశం పడిపోయినట్లు సమాచారం. ఇక బల్లికురవ సత్యకృష్ణ గ్రానైట్‌లో ఈ ఏడాది ఆగస్టు 3వ తేదీన గ్రానైట్‌కు చెందిన పెద్ద పెద్ద రాళ్లు పడిపోవడంతో 6 మంది కూలీలు మరణించారు. అలాగే 20 రోజుల కిందట ఆర్‌ఎల్ పురంలోని ఒక క్వారీలో డంపర్ తిరగబడడంతో ఒకరు మరణించినట్లు సమాచారం. మొత్తం మీద ఏడాదిలో ఇప్పటి వరకు 12 మంది కార్మికులు, కూలీలు మరణించినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అయితే అనధికారిక లేక్కల ప్రకారం క్వారీలలో ప్రతి రోజూ ఏదోక ప్రమాదం జరుగుతూనే ఉందని, ఈ ఘటనల్లో పదుల సంఖ్యలో కార్మికులు మృతి చెందినట్లు కార్మిక సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు
ఎక్కడ చీమకుర్తి...ఎక్కడ హైదరాబాద్..?.
యజమానులకు కామధేనువుగా మారిన గ్రానైట్ క్వారీలు కార్మికులు, కూలీల పాలిట యమకూపాలుగా మారి ప్రాణాలు తోడేస్తున్నాయి. తవ్వకాల కోసం క్వారీలలోకి దిగిన కూలీలు ప్రాణాలతో సురక్షితంగా తిరిగి వస్తారని చెప్పలేని పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లా గనులలో భద్రతకు సంబంధించిన కార్యాలయం హైదరబాద్‌లో ఉంది. అక్కడ ఉన్న రీజియన్–3 పరిధిలోకి ఈ ప్రాంతం వస్తుంది. అంటే ఇక్కడ చీమకుర్తి, బల్లికురవ మండలాలోని గ్రానైట్‌లలో పనిచేస్తున్న కూలీలు, కార్మికుల భద్రతను ఎక్కడో తెలంగాణాలోని హైదరాబాద్‌లో ఉన్న సేఫ్టీ అధికారులు పర్యవేక్షించాల్సి రావడమే పెద్ద విషాదమని చెప్పాలి. హైదరాబాద్ రీజియన్ పరిధిలో 19 జిల్లాలు ఉంటాయి. అందులో ప్రకాశం జిల్లా ఒకటి. దీంతో క్వారీల్లో భద్రతను అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. హైదరాబాద్ రీజియన్‌కు చెందిన ఒక్కో అధికారి వారి స్థాయిని బట్టి ఏడాదిలో కనీసం 10 సార్లు క్వారీలను పర్యవేక్షించాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం శ్రమ్ సువిధ పోర్టల్‌లో అధికారులు గమనించిన భద్రతా లోపాలకు సంబంధించిన వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. దీనికి భిన్నంగా అధికారులు నామ మాత్రంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. క్వారీ యజమానుల కనుసన్నల్లో పర్యటనలు జరిపి వారికి అనుకూలంగా నివేదికలు సమర్పిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
భద్రతా చర్యలు తీసుకుంటూనే ఉన్నాం
చీమకుర్తి, బల్లికురవ గ్రానైట్ క్వారీల్లో భద్రతా చర్యలు తీసుకుంటూనే ఉన్నాం. క్రమం తప్పకుండా క్వారీలను పర్యటించి తనిఖీలు నిర్వహిస్తున్నాం. క్వారీ యజమానులకు భద్రతా చర్యలపై అవగాహన కల్పిస్తున్నాం. ఏడేనిమిదేళ్లతో పోలిస్తే క్వారీల్లో ప్రమాదాలు చాలా వరకు తగ్గుముఖం పట్టాయి.
– జ్ఞానేశ్వరరావు, డీడీఎంఎస్, హైదరాబాద్


