రైతులకు పనుల కాలం అధికారులపై సర్వే భారం!
మార్కాపురం: ఎంకి పెళ్లి.. సుబ్బి చావుకొచ్చిందన్నట్లుగా వ్యవసాయాధికారుల పరిస్థితి తయారైంది. చంద్రబాబు ప్రభుత్వం రెండు రోజుల క్రితం రైతన్న మీకోసం అంటూ ఓ కార్యక్రమాన్ని అట్టహాసంగా ప్రారంభించింది. గ్రామాలకు వెళ్లి చంద్రబాబు ప్రభుత్వం రైతుల కోసం అమలు చేసిన పథకాలు వివరించడంతోపాటు రోజూ 90 మంది రైతుల డేటాను ఏపీఏఐఎమ్‌ఎస్ యాప్‌లో నమోదు చేయాలని ఆదేశించింది. దీంతో వ్యవసాయాధికారులు, రైతు సేవా కేంద్రాల సిబ్బంది తలలు పట్టుకుంటున్నారు. ప్రస్తుతం జిల్లాలో 36 మండలాలు ఉండగా మార్కాపురం, యర్రగొండపాలెం, గిద్దలూరు, కనిగిరి, దర్శి, కొండపి, ఒంగోలు తదితర ప్రాంతాల్లో వ్యవసాయ సబ్ డివిజన్‌లు ఉన్నాయి. వీటి పరిధిలోని అధికారులు, సిబ్బంది 2 రోజుల నుంచి గ్రామాల్లో తిరుగుతున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రైతులను కొన్ని ప్రశ్నలు అడిగి సమాధానాలు చెప్పమంటే ఆగ్రహం, అసహనం వ్యక్తం చేస్తుండటంతో వ్యవసాయాధికారులు తలపట్టుకుంటున్న పరిస్థితి. ఖరీఫ్ సీజన్ దాటి, రబీ సీజన్ ప్రారంభమైనప్పటికీ ఆర్‌ఎస్‌కేల ద్వారా ఆధునిక వ్యవసాయ పనిముట్లుగానీ, ఎరువులుగానీ సరఫరా చేయలేదు. వ్యవసాయాధికారులు రైతు వద్దకు వెళ్లి పేరు, కుటుంబ సభ్యులు, ఆధార్‌కార్డుతో పాటు ఎన్ని ఎకరాల పొలం, ఏమేమి సాగు చేశారు, మీకేమైనా ఎరువులు కావాలా, వ్యవసాయ పనిముట్లు కావాలా? ఇలాంటి ప్రశ్నలు అడుగుతుండటం రైతుల ఆగ్రహానికి కారణమవుతోంది. రబీ సీజన్ ప్రారంభమైనప్పటికీ తాము కోరిన విత్తనాలు సబ్సిడీపై ఇవ్వకుండా మీకేమి కావాలని కోరడంలో ఆంతర్యం ఏమిటని వ్యవసాయాధికారులను రైతులు ఎదురు ప్రశ్నిస్తున్నారు. దీంతో ఏఓలు, వీఏఏలకు రైతుల నుంచి వివరాల సేకరణ సవాల్‌గా మారింది.
సాధ్యమయ్యే పనేనా?
పత్తి, మిర్చి కోతలు ప్రారంభం కావడంతో గ్రామాల్లో రైతులందరూ పొలాల్లో ఉంటున్నారు. రైతన్న మీకోసం కార్యక్రమానికి 10 నుంచి 20 మంది మాత్రమే హాజరవుతున్నారు. దీంతో ఏపీఏఐఎంఎస్ యాప్‌లో రోజుకు 90 మంది రైతుల వివరాలు ఎలా నమోదు చేయాలో వ్యవసాయ సిబ్బందికి అంతుపట్టడం లేదు.


