బండ్లమూడి నిందితులపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలి
ఒంగోలు టౌన్: చీమకుర్తి మండలంలోని బండ్లమూడి గ్రామంలో దళితులపై మారణాయుధాలతో దాడి చేసిన నిందితులపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని ఎమ్మార్పీఎస్ నాయకులు డిమాండ్ చేశారు. డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావును కలిసి మంగళవారం వినతిపత్రం అందజేశారు. బండ్లమూడి దళితులపై నమోదు చేసిన కౌంటర్ కేసును ఎత్తివేయాలని, చీమకుర్తి సీఐని సస్పెండ్ చేసి ఎస్సీ, ఎస్టీ చట్టం కింద చర్యలు తీసుకోవాలని కోరారు. బాధిత కుటుంబానికి ఇంటి స్థలం, 2 ఎకరాల వ్యవసాయ భూమి, ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని విన్నవించారు. అగ్రకులాలతో సంబంధం లేకుండా ఎస్సీ కాలనీలో రేషన్ షాపు ఏర్పాటు చేయాలని వినతి పత్రంలో పేర్కొన్నారు. డీఎస్పీని కలిసిన వారిలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మున్నంగి నాగరాజు, జాతీయ నాయకులు కె.విశ్వనాథ్, సొట్ట నరేంద్రబాబు, రుద్రపోగు సురేష్, జిల్లా అధ్యక్షులు తోరటి ఆనంద్, నగర అధ్యక్షుడు గుంటూరు ప్రభుదాస్ తదితరులు ఉన్నారు.


