ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులు రాజకీయ రంగులు పూసుకోవద్దు
దర్శి: ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు రాజకీయ పార్టీలపై అభిమానం ఉన్నప్పటికీ బహిరంగంగా పార్టీ రంగులు పూసుకోవద్దని ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు దేవరపల్లి సురేష్ బాబు పేర్కొన్నారు. జిల్లా పర్యటనలో భాగంగా దర్శి ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్‌లో ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులతో ఇష్టాగోష్టి కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా సురేష్ బాబు మాట్లాడుతూ రిజర్వేషన్లలో మెరిట్ ఆధారంగా ఎస్సీ, ఎస్టీలకు జనరల్ కేటగిరీలో అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు రాజకీయ పార్టీల ముద్రలు పడితే ప్రభుత్వాలు మారినప్పుడు క్షేత్రస్థాయిలో కక్షసాధింపులు, వేధింపులకు గురవుతున్న పలు సందర్భాలు ఉన్నాయని తెలిపారు. ఉద్యోగులు ప్రభుత్వ నిబంధనల ప్రకారం విధులు నిర్వహిస్తూ ప్రజలకు సేవ చేయాలే తప్ప నేతల మెప్పు కోసం అత్యుత్సాహం ప్రదర్శించవద్దని హితవు పలికారు. అలా చేస్తే పలు ఇబ్బందులకు గురికావాల్సి వస్తుందన్నారు. ఎస్సీ, ఎస్టీలకు ఉద్యోగ నియామకాలు, పదోన్నతుల్లో రిజర్వేషన్లలో స్పష్టమైన విధానం అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రిజర్వేషన్లలో మెరిట్ ఆధారంగా జనరల్ కేటగిరీలో అవకాశం ఇవ్వకుండా రిజర్వేషన్ల కోటాకు మాత్రమే పరిమితం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ అధికారులకు వాళ్ల ప్రతిభ, పనితీరును ఆధారంగా చేసుకుని ప్రాధాన్యత గల పోస్టుల్లో నియమించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఉద్యోగులు ఐక్యతతో దళిత ఉద్యోగ సంఘాల బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి అసోసియేషన్ కృషి చేస్తుందన్నారు. కార్యక్రమంలో ఆ సంఘ నాయకులు తానం చెన్న కేశవులు, గనిపె రవి కుమార్, గుమ్మడి శాంత కుమార్ తదితరులు పాల్గొన్నారు.


