13 నెలలు.. 8 అర్జీలు..!
ఒంగోలు సబర్బన్: 13 నెలలుగా కలెక్టర్ ఆధ్వర్యంలో ఒంగోలులోని ప్రకాశం భవన్లో నిర్వహిస్తున్న స్పందన కార్యక్రమానికి వస్తున్నాం.. అర్జీల మీద అర్జీలు ఇచ్చుకుంటూ పోతున్నాం.. ఇప్పటి వరకు 8 సార్లు కలెక్టర్ గ్రీవెన్స్‌కు వచ్చి అర్జీలిచ్చాం.. కానీ సమస్య పరిష్కారం కాలేదు. పొదిలి తహసీల్దార్, మున్సిపల్ కమిషనర్, ఆర్‌అండ్‌బీ డీఈ, ఏఈ, పొదిలి ఎస్సైల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ వస్తున్నాం. కానీ, మా సమస్య మాత్రం పరిష్కారం కాలేదు. సమస్య పరిష్కరించకుండానే పరిష్కరించామని అధికారులు మెసేజ్ పెట్టారు. ఇదెక్కడి న్యాయం అంటూ పొదిలికి చెందిన దాసరి రవిచంద్రకుమార్ కలెక్టర్ పీ రాజాబాబుకు సోమవారం తన గోడు వెల్లబోసుకున్నారు. ఒంగోలులోని కలెక్టరేట్‌లో కలెక్టర్ పీ రాజాబాబు ఆధ్వర్యంలో నిర్వహించిన స్పందన కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి అర్జీదారులు పోటెత్తారు. పొదిలికి చెందిన దాసరి రవిచంద్రకుమార్, దాసరి ఝాన్సీరాణి మరోసారి అర్జీ అందజేశారు. పొదిలి నగర పంచాయతీ పరిధిలోని పొదిలి నుంచి దర్శి వెళ్లే ఆర్‌అండ్‌బీ రోడ్డు సర్వే నంబర్ 479లో గల ప్రభుత్వ రహదారిని (తోళ్లమడుగు వాగు వద్ద) దర్శి మండలం దర్శి గ్రామానికి చెందిన యోగయ్య ఆక్రమించి అక్రమంగా రేకుల షెడ్డు నిర్మించాడని తెలిపారు. దానివలన సర్వే నంబర్ 396/7లో వర్షం నీరు నిలిచి తమ పొలం, రోడ్డు కోతకు గురవుతున్నాయని తెలిపారు. అలా జరగకుండా కాపాడాలని గ్రీవెన్స్‌లో అర్జీలు ఇచ్చుకుంటూ వస్తున్నామని, కానీ పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మొదటి అర్జీ 2024 సెప్టెంబర్ 23న ఇచ్చామన్నారు. ప్రస్తుతం 9వ సారి వచ్చి అర్జీ ఇస్తున్నామని కలెక్టర్‌కు వివరించారు. అర్జీ ఇచ్చినప్పుడల్లా అధికారులు ఒకటీరెండు రోజులు హడావిడి చేస్తారని, ఆ తర్వాత పక్కన పెట్టేస్తారని తెలిపారు. సమస్య పరిష్కారం కాకుండానే పరిష్కరించినట్లు సెల్‌ఫోన్‌కు మెసేజ్ వచ్చినట్లు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. సమస్యను పూర్తిగా ఆలకించిన కలెక్టర్ రాజాబాబు.. అధికారులపై సీరియస్ అయ్యారు. సంబంధిత అధికారులను పిలిపించి మాట్లాడారు, పొదిలి కమిషనర్‌తో ఫోన్‌లో మాట్లాడారు. సంబంధిత అధికారులు సంయుక్తంగా కూర్చుని వారం రోజుల్లో సమస్య పరిష్కరించి తన దృష్టికి తీసుకురావాలని ఆదేశించారు.
చెంచుపాలెం గ్రామానికి శ్మశానం కావాలంటూ విద్యార్థినుల వినతి...
పొన్నలూరు మండలం చెంచుపాలెం గ్రామంలో శ్మశాన వాటిక లేకపోవడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆ గ్రామానికి చెందిన గుదె ప్రణీతరెడ్డి, మరికొందరు విద్యార్థినులు కలెక్టర్ రాజాబాబుకు తెలిపారు. 10 సంవత్సరాల నుంచి ఈ సమస్య గురించి అనేక మంది కలెక్టర్ల దృష్టికి తీసుకొచ్చినా పరిష్కారం కాలేదన్నారు. మృతదేహాలను వాగులో పారేయడం ఇష్టంలేక అధికారులకు చెప్పడం జరిగిందన్నారు. కానీ వారు స్పందించలేదన్నారు. శ్మశానానికి స్థలం కేటాయించాలని వేడుకున్నారు. దీనిపై సంబంధిత అధికారులతో కలెక్టర్ మాట్లాడారు. వారం రోజుల్లో శ్మశాన సమస్య పరిష్కారం కావాలని ఆదేశించారు.
పొదిలికి సంబంధించిన శ్మశాన సమస్యపై స్పందన కార్యక్రమం చుట్టూ ప్రదక్షిణలు
సమస్య పరిష్కారం కాకుండానే పరిష్కారం అయినట్లు చూపించిన వైనం
కలెక్టర్ స్పందన కార్యక్రమానికి పోటెత్తిన అర్జీదారులు
అర్జీలపై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు : కలెక్టర్ రాజాబాబు
స్పందన కార్యక్రమంలో వచ్చిన అర్జీలపై ఆయా శాఖల అధికారులు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ రాజాబాబు హెచ్చరించారు. అధికారులు ప్రత్యేక దృష్టి సారించి అర్జీలను సకాలంలో గడువులోగా శాశ్వత పరిష్కారం చూపాలని ఆదేశించారు. ప్రతిరోజూ ఐవీఆర్‌ఎస్ కాల్స్ ద్వారా పలువురు అర్జీదారులతో మాట్లాడి అర్జీల పరిష్కారం విధానం గురించి తెలుసుకుంటున్నట్లు తెలిపారు. ప్రతి కార్యాలయంలో ఒక నోడల్ అధికారిని నియమించడం జరిగిందని, సమస్యల పరిష్కారం కోసం అధికారుల వద్దకు వచ్చే ప్రజలతో మర్యాదగా ప్రవర్తించడమే కాకుండా వారి సమస్యను సావధానంగా విని నిబంధనల మేరకు సానుకూల విధానంలో పరిష్కారమయ్యేలా చూడాలని సూచించారు. అర్జీల పరిష్కార ప్రగతిని ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని కలెక్టర్ తెలిపారు.


