హెచ్‌ఆర్ పాలసీ, ఎంటీఎస్ అమలు చేయాలి
● ఏపీ సమగ్రశిక్షా కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్షుడు హరిబాబు
ఒంగోలు సిటీ:
సమగ్రశిక్షా ఉద్యోగులకు హెచ్‌ఆర్ పాలసీ, ఎంటీఎస్‌ను వెంటనే అమలు చేయాలని ఏపీ సమగ్రశిక్షా కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్షుడు హరిబాబు డిమాండ్ చేశారు. సోమవారం స్థానిక కలెక్టరేట్ వద్ద ఆంధ్రప్రదేశ్ సమగ్రశిక్షా కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జేఏసీ ఆధ్వర్యంలో సమగ్రశిక్షా ఉద్యోగుల పోరాట దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు దాటినా సమస్యలు పరిష్కారం కాలేదన్నారు. ఉద్యోగ భద్రత లేకుండా, తక్కువ జీతాలతో సరైన హెచ్‌ఆర్ విధానం లేకుండా అనేక మంది ఉద్యోగులు కష్టాల్లో ఉన్నారన్నారు. హెచ్‌ఆర్ పాలసీ అమలు, మినిమం టైం స్కేల్ అమలు చేసి జీతాల పెంపు, సమయానికి చెల్లింపులు, ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయడం, రిటైర్మెంట్ వయస్సు 62 ఏళ్లకు పెంచడం, ఈపీఎఫ్, గ్రాడ్యుటీ–పెన్షన్ ప్రయోజనాలు అమలు, ఆరోగ్య బీమా, మెడికల్ సదుపాయాలు కల్పించడం, ఖాళీ పోస్టుల భర్తీ వంటి అంశాలను వెంటనే అమలు చేయాలని కోరారు. సీడబ్ల్యూఎస్‌ఎన్ విద్యార్థులకు సంవత్సరం పొడవునా ఫిజియోథెరపీ అందించాలని, తదితర సమస్యలు పరిష్కరించాలని కోరారు. అనంతరం కలెక్టర్ స్పందన కార్యక్రమంలో కలెక్టర్ రాజాబాబుకు వినతిపత్రం అందజేశారు. సమస్యల పరిష్కారం కోసం డిసెంబరు 10వ తేదీ చలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు జేఏసీ రాష్ట్ర నాయకులు ప్రకటించారు. అన్ని జిల్లాల సమగ్రశిక్షా ఉద్యోగులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఫెడరేషన్ గౌరవాధ్యక్షుడు ఎం.రమేష్, కార్యనిర్వాహక అధ్యక్షుడు పి.వి.మహేష్, ట్రెజరర్ యు.కళ్యాణి, ఎస్‌కే జాన్‌సైదా, తదితరులు పాల్గొన్నారు.


