లారీకింద పడి యువకుడు దుర్మరణం
కంభం: లారీ కిందపడి యువకుడు మృతి చెందాడు. ఈ సంఘటన స్థానిక కందులాపురం కూడలి సమీపంలో హైవే రోడ్డుపై సోమవారం జరిగింది. వివరాల్లోకి వెళితే..కందులాపురం పంచాయతీలో నివాసం ఉంటున్న సయ్యద్ మదార్ కుమారుడు సయ్యద్ అలి(26) సోమవారం రాత్రి ద్విచక్రవాహనంపై వెళ్తున్న క్రమంలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ సమీపంలో ఉన్న డివైడర్ వద్ద లారీని దాటబోయి లారీ కిందపడటంతో తలపగిలి అక్కడికక్కడే మృతిచెందాడు. ద్విచక్రవాహనంపై వెనుక కూర్చొని ఉన్న మరో యువకుడు కుడి వైపుకు కిందపడి పోవడంతో స్వల్పగాయాలతో బయటపడ్డాడు. లారీ డ్రైవర్ లారీని సంఘటనా స్థలంలో వదిలేసి పరారైనట్లు తెలిసింది. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కంభం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అలి పెయింటింగ్ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు సంఘటనా స్థలానికి చేరుకొని బోరున విలపించారు.
లారీకింద పడి యువకుడు దుర్మరణం


