అదిగో పులి..!
చీమకుర్తి: రామతీర్థం పరిసరాల్లోని గ్రానైట్ క్వారీల్లో చిరుతపులి తిరుగుతుందంటూ ఫేక్ వీడియోను గుర్తు తెలియని వ్యక్తులు సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. సోమవారం చీమకుర్తి సమీపంలోని రామతీర్థం, నల్లకొండ, ఎర్రకొండ, గ్రానైట్ క్వారీల పరిసరాల్లో పులి సంచరిస్తుందన్న వీడియో హల్‌చల్ కావడంతో ఫారెస్ట్ ఉన్నతాధికారులు అనుమానిత ప్రాంతాలను జల్లెడ పట్టారు. తీరా గిద్దలూరు ఫారెస్ట్ ఆఫీసర్ వినోద్‌కుమార్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేసిన చిరుతపులి వీడియో ఫేక్ అని, అది మధ్యప్రదేశ్ ప్రాంతంలో జరిగిన గతంలోని వీడియో అని నిర్ధారించారు. దీంతో ఒక్కసారిగా గ్రానైట్ క్వారీల్లోని స్థానికులు, చీమకుర్తి వాసులు ఊపిరిపీల్చుకున్నారు. పులి ఉందని చెప్పడంతో డీఎఫ్‌ఓ వినోద్‌కుమార్, సబ్‌డివిజన్ డీఎఫ్‌ఓ శ్రీనివాసులు, ఫారెస్ట్ రేంజర్ నరసింహారావు తమ సిబ్బందితో కలిసి గ్రానైట్ క్వారీల ప్రాంతాలను పరిశీలించి ఎలాంటి పులి ఆనవాళ్లు లేవని, సోషల్ మీడియాలో వచ్చిన వీడియో ఫేక్ అని నిర్ధారించారు.
● గ్రానైట్ క్వారీ పరిసరాల్లో పులి తిరుగుతుందని తప్పుడు ప్రచారం
● జల్లెడ పట్టిన ఫారెస్ట్ అధికారులు
● చివరకు పాత వీడియో అని తెలియడంతో ఊపిరిపీల్చుకున్న స్థానికులు


