గ్రూపుగా దోపిడీ!
మెప్మాలో నకిలీ దందా నగరంలో 200 నకిలీ గ్రూపులు అక్రమంగా రూ.20 కోట్లకుపైగా బ్యాంకు రుణాలు తీసుకున్నట్టు ఆరోపణలు నకిలీలు సృష్టించడంలో ఓ టీడీపీ ఎమ్మెల్యే పీఏ పాత్ర సదరు పీఏ 10 గ్రూపుల ద్వారా రూ.కోటికిపైగా రుణాలు నకిలీలతో కుమ్మకై ్కన మెప్మా అధికారులు, సిబ్బంది నకిలీ గ్రూపులపై చర్యలకు వెనకాడుతున్న అధికారులు అక్రమార్కులకు మద్దతు ఇస్తున్నారంటూ బాధితుల ఆరోపణలు
సాక్షి ప్రతినిధి, ఒంగోలు:
పట్టణ పేదరిక నిర్మూలనా సంస్థ (మెప్మా)లో నకిలీ స్వయం సహాయక మహిళా (డ్వాక్రా) గ్రూపుల దందా రచ్చకెక్కింది. బడా బాబులు, అధికార పార్టీల నాయకుల అండదండలతో నకిలీ గ్రూపులు విచ్చలవిడిగా ఏర్పాటై బ్యాంకుల నుంచి రూ.కోట్లలో రుణాలు తీసుకున్న దందా వెలుగులోకి రావడం తీవ్ర కలకలం సృష్టిస్తోంది. మహిళల పొదుపు సొమ్మును అధికార పార్టీకి చెందిన నేతలు కొల్లగొడుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలో ఒంగోలు నగరపాలక సంస్థతో పాటు చీమకుర్తి, దర్శి, గిద్దలూరు, కనిగిరి, మార్కాపురంలలో మెప్మా ఆధ్వర్యంలో స్వయం సహాయక సంఘాల మహిళా గ్రూపులు ఉన్నాయి. జిల్లా మొత్తం మీద 9,545 సంఘాలు ఉన్నాయి. వాటిలో ఒంగోలు కార్పొరేషన్‌లో 4,217 సంఘాలున్నాయి.
200కు పైగా బోగస్ గ్రూపులు:
ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్‌లోనే దాదాపు 200లకు పైగా బోగస్ గ్రూపులు ఉన్నట్లు సమాచారం. అధికార పార్టీ నాయకుల అండదండలతో ఈ బోగస్ గ్రూపులు ఏర్పాటు చేసి దాదాపు ఒక్కో గ్రూపునకు రూ.10 లక్షల చొప్పున దాదాపు రూ.20 కోట్లకు పైగా బ్యాంకుల నుంచి రుణాలు పొందినట్లు తెలుస్తోంది. 2025 ఆగస్టుకు ముందు వరకు గ్రూపులు మాన్యువల్‌గా ఉండేవి. ఆగస్టులో రాష్ట్ర ప్రభుత్వం స్వయం సహాయక సంఘాలను ఆన్‌లైన్ చేశారు. ఆగస్టుకు ముందే బోగస్ గ్రూపుల ద్వారా బ్యాంకుల నుంచి అక్రమంగా రుణాలు తీసేసుకున్నారని తెలుస్తోంది. అధికార పార్టీ నేతలు తమ అనుచరులు, బంధువులు, స్నేహితులకు సంబంధించిన మహిళల పేరుతో బోగస్ గ్రూపులు ఏర్పాటు చేసి బ్యాంకుల నుంచి భారీగా రుణాలు తీసుకున్నారని తెలుస్తోంది.
టీడీపీ ప్రజా ప్రతినిధికి చెందిన పీఏ హస్తం..
ఒంగోలు నగరంలో మెప్మా అవినీతి తారస్థాయికి చేరుకుంది. ఈ సంస్థలో ఒకొక్కటిగా వెలుగు చూస్తున్న అక్రమాలు విస్తుగొల్పుతున్నాయి. బోగస్ గ్రూపుల ఏర్పాటులో జిల్లాలోని టీడీపీ ప్రజా ప్రతినిధికి చెందిన ప్రైవేటు పీఏ హస్తం ఉన్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సదరు పీఏ పదికి పైగా గ్రూపులు ఏర్పాటు చేసి దాదాపు రూ.కోటికి పైగా బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. బోగస్ గ్రూపుల విషయం బయటకు పొక్కడంతో పాటు, బ్యాంకుల నుంచి మహిళలకు నోటీసులు రావడంతో సదరు పీఏ మెప్మా అధికారులపై తీవ్ర ఒత్తిడి తీసుకొస్తున్నట్టు తెలిసింది. అలాగే నోటీసులు అందుకున్న మహిళల వద్దకు వెళ్లి రుణాలు తామే చెల్లిస్తామని బతిమిలాడుకుంటున్నట్టు సమాచారం.
కేశవస్వామి పేటలో 14 బోగస్ గ్రూపులు:
ఒంగోలు నగరంలోని కేశవస్వామిపేటలో 14 బోగస్ గ్రూపులు ఉన్నట్లు గుర్తించారు. స్థానికంగా ఉంటున్న ఎస్‌టీ సామాజిక వర్గానికి చెందిన వారు ఉంటున్నారు. అయితే నగరానికి చెందిన కొల్లాబత్తిన దివ్య శాంతి అనే రిసోర్స్ పర్సన్ (ఆర్‌పీ) ద్వారా కేశవస్వామి పేటలో 14 డ్వాక్రా గ్రూపులు తయారు చేసింది. సదరు గ్రూపుల్లో కొల్లాబత్తిన దివ్య శాంతి ఒక్కొక్క గ్రూపులో 5–6 పేర్ల చొప్పున రుణాలు తీసుకుంది. సభ్యులకు తెలియకుండానే రుణాలు తీసుకొని వాడేసుకుంది. ఆ రుణాలను తిరిగి బ్యాంకుకు చెల్లించకపోవటంతో బ్యాంకుల నుంచి నోటీసులు రుణాల సొమ్ము తీసుకోని సభ్యులకు వచ్చాయి. దాంతో కంగుతిన్న డ్వాక్రా గ్రూపు సభ్యులైన మహిళలు కొల్లాబత్తిన దివ్య శాంతిపై పీడీ శ్రీహరికి ఫిర్యాదు చేశారు. దివ్యశాంతిని పిలిపించిన పీడీ శ్రీహరి సభ్యులకు తెలియకుండా తీసుకున్న రుణాలను బ్యాంకుల్లో కట్టాలని దివ్యశాంతిని ఆదేశించారు. చెల్లిస్తానని పీడీ సమక్షంలో లెటర్ కూడా రాసిచ్చింది. కానీ బ్యాంకులకు చెల్లించలేదు. ఇది జరిగి ఎనిమిది నెలలైనా దివ్య శాంతి డబ్బులు కట్టకపోగా మెప్మా పీడీ కూడా దివ్యశాంతిని వెనకేసుకుంటూ వస్తున్నారని ఎస్‌టీ మహిళలు ఆరోపిస్తున్నారు. కూలి పనులు చేసుకునే తమకు అన్యాయం చేయాలని చూస్తున్నారని పీడీపై వాళ్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్యాంకుల నుంచి నోటీసులతో పాటు లీగల్ నోటీసులు కూడా వస్తున్నాయన్నారు.
నకిలీల్లో మెప్మా అధికారులు, సిబ్బంది..
ఈ నకిలీల వ్యవహారంలో మెప్మా అధికారులు, సిబ్బంది పాత్ర కూడా ఉందన్న ఆరోపణలు పెద్ద ఎత్తున వెల్లువెత్తుతున్నాయి. నకిలీ గ్రూపులు ఏర్పాటు చేసి బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోవటం రిసోర్స్ పర్సన్స్ (గ్రూపు నిర్వాహకురాలు) వల్ల మాత్రమే కాదు. ఎందుకంటే ఆర్‌పీలతో పాటు మెప్మాలో పనిచేస్తున్న అధికారులు, సిబ్బంది పాత్ర లేకుండా బ్యాంకులు రుణాలు ఇవ్వరు. రుణాలు తీసుకోవాలంటే ఆర్‌పీలతో పాటు మెప్మాలో పనిచేస్తున్న అధికారుల సంతకాలు తప్పనిసరి. మామూలుగా బ్యాంక్ లింకేజికి అర్హత కలిగిన సంఘ సభ్యుల రుణాలను రిసోర్స్ పర్సన్‌లు శ్రీమహిళాకాశం ఆన్‌లైన్ యాప్‌శ్రీ లో వారి లాగిన్‌ల ద్వారా లోన్ రిక్వెస్ట్ చేయాలి. రూ.10 లక్షల వరకు సంబంధిత అధికారుల అప్రూవల్‌తో రుణాలు మంజూరవుతాయి. రూ.10 లక్షల పైబడిన రుణాలు మాత్రమే కింది స్థాయి అధికారుల అప్రూవల్ అయిన తరువాత ప్రాజెక్ట్ డైరెక్టర్ లాగిన్‌కు వస్తాయి. అక్కడ రిక్వెస్ట్ వచ్చిన సంఘాల సంఘ తీర్మాన పత్రం, బ్యాంకు లోన్ అప్లికేషను, లోన్ ఫారంను నిశితంగా పరిశీలించి జిల్లాలోని అన్ని రుణాలను బ్యాంకులకు సిఫారసు చేస్తూ అప్రూవల్ చేస్తారు.
మహిళల స్వావలంబన కోసం ఏర్పాటు చేసిన మెప్మా (పట్టణ పేదరిక నిర్మూలనా సంస్థ) అధికార పార్టీ నాయకుల అక్రమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. అధికారాన్ని అడ్డంపెట్టుకుని నకిలీ గ్రూపులను సృష్టించారు. లేని పొదుపు సంఘాలను ఉన్నట్లుగా చిత్రీకరించి మాయచేశారు. బ్యాంకులను బురిడీ కొట్టించి రూ.కోట్ల రుణాల సొమ్ము మెక్కేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బ్యాంకుల నుంచి నోటీసులు రావడంతో లబ్ధిదారులు అవాక్కవుతున్నారు. ఇదేం దారుణం అంటూ అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. ఈ బాగోతం మెప్మా అధికారులకు తెలిసినప్పటికీ చర్యలకు వెనుకడుగు వేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. అవినీతి వ్యవహారంలో వారికీ వాటా ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ దందాలో ఓ టీడీపీ ఎమ్మెల్యే పీఏది కీలక పాత్ర ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అలాగే అధికారులు, సిబ్బంది హస్తం కూడా ఉందని ప్రచారం జరుగుతోంది.
గ్రూపుగా దోపిడీ!


