కలిసి నడుద్దాం.. విజయమే లక్ష్యంగా పనిచేద్దాం
కార్యకర్తలకు ఎలాంటి సమస్య వచ్చినా అండగా నిలబడతాం గ్రామస్థాయిలో పార్టీని బలోపేతం చేద్దాం ప్రజల భాగస్వామ్యంతో పార్టీ కార్యక్రమాలు విజయవంతం చేయాలి వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి
ఒంగోలు సిటీ: వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలంతా కుటుంబ సభ్యుల్లా కలిసి మెలిసి ముందుకు సాగాలని, జననేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకునే వరకు అవిశ్రాంతంగా పనిచేద్దామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి పిలుపునిచ్చారు. పార్టీ జిల్లా కార్యాలయంలో సోమవారం మండల పార్టీ, పట్టణ పార్టీ అధ్యక్షుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ పార్టీలో కష్టపడిన ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు, ప్రాధాన్యత ఉంటుందని చెప్పారు. కార్యకర్తలకు మీ మండలంలో ఏదైనా సమస్య ఉంటే తమ దృష్టికి తీసుకు రావాలని సూచించారు. పార్టీ కార్యకర్తలకు అన్నీ విధాలుగా అండగా ఉంటామని, నియోజకవర్గ ఇన్‌చార్జి, జిల్లా అధ్యక్షులు అందరూ కలిసి అండగా నిలబడతామని స్పష్టం చేశారు. కార్యకర్తలు, నాయకులు పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు. గ్రామ స్థాయిలో అన్నీ వర్గాల ప్రజలను కలుపుకొని పార్టీ నిర్వహించే కార్యక్రమాలను విజయవంతం చేయాలన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పాలనలో నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని చెప్పారు. పార్టీలు, కులం, మతం చూడకుండా జగనన్న పథకాలు అందరికీ అందజేశారని గుర్తు చేశారు. 2019 నుంచి 2024 వరకు రాష్ట్రంలో సంక్షేమ పథకం అందని ఇల్లు లేదన్నారు. ప్రతిఒక్క పథకాన్ని ఇంటి వద్దకే తెచ్చి అందించిన ఘనత వైఎస్సార్ సీపీ ప్రభుత్వానికి మాత్రమే దక్కుతుందన్నారు. చంద్రబాబు ప్రభుత్వం ప్రజలను ఏ విధంగా నమ్మించి దగా చేసిందో ప్రతి ఒక్కరికీ అర్థమయ్యేలా చెప్పాలని సూచించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నింటిలో కోతలు పెడుతున్నారని, చివరికి ఉపాధి హామీ జాబ్ కార్డులను కూడా తొలగించడం దారుణమన్నారు. పేదల పొట్ట కొడుతున్న చంద్రబాబు ప్రభుత్వానికి, పేద ప్రజలందరికీ సంక్షేమ పథకాలతో ఆదుకున్న జగనన్న ప్రభుత్వానికి మధ్య ఉన్న తేడా స్పష్టంగా వివరించి చెప్పాలన్నారు. జగనన్నను ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన అవసరం ఉందని, అందుకోసం పార్టీ కార్యకర్తలు, నాయకులంతా ప్రజలను కలుపుకొని ముందుకు సాగాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, పార్టీ ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు కె.వి.రమణారెడ్డి, వై.వెంకటేశ్వరరావు, బొట్ల రామారావు, మాజీ ఎమ్మెల్యే కసుకుర్తి ఆదెన్న, తదితరులు పాల్గొన్నారు.


